భారత్‌లో అరుదైన సొరంగమార్గానికి నేడు ప్రారంభోత్సవం

October 03, 2020


img

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనాలి-లేహ్ మద్య ఓ అరుదైన సొరంగమార్గాన్ని ప్రధాని నరేంద్రమోడీ నేడు ప్రారంభించనున్నారు. సుమారు 20 ఏళ్ళ క్రితం దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దీనికి శంఖుస్థాపన చేశారు. కనుక దీనికి ఆయన పేరే (అటల్ టన్నెల్) పెట్టారు. ఈరోజు ఉదయం 10-11 గంటల మద్య ప్రధాని నరేంద్రమోడీ, రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ కలిసి మనాలీవైపు నుంచి దీనిని ప్రారంభిస్తారు. నేటి నుంచే అటల్ సొరంగమార్గం ద్వారా హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్ సర్వీసులు ప్రారంభం అవుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తెలిపారు.     

నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలో పెండింగులో ఉన్న అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. వాటిలో ఈ అటల్ సొరంగమార్గం కూడా ఒకటి. దీంతో స్థానిక ప్రజల దశాబ్ధాల కలను నెరవేర్చడంతో పాటు, ప్రతికూల పరిస్థితులలో సైతం సరిహద్దుల వద్దకు సైనికులను, ఆయుధాలను, ఆహారాన్ని తీసుకువెళ్ళేందుకు ఈ సొరంగమార్గం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ దీనిపై ప్రత్యేకశ్రద్ద పెట్టి పూర్తి చేయించారు. 

ఆ ప్రాంతంలో ఏడాదిలో 6 నెలలు విపరీతమైన మంచు కురుస్తుంటుంది. కనుక మిగిలిన ఆరు నెలలోనే అక్కడ పనులు జరుపుతూ 10 ఏళ్ళలో దీనిని పూర్తి చేశారు. మంచుకురిసే ఆ ఆరు నెలల్లో ఆ ప్రాంతాలకు బయటి ప్రపంచంతో అన్ని సంబంధాలు తెగిపోతుండేవి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇన్నేళ్ళకు ప్రధాని నరేంద్రమోడీ పూనుకొని వారి సమస్యను తీర్చారు. ఈ సొరంగమార్గం అందుబాటులోకి ఇప్పుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా 365 రోజులు స్థానికులు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించగలుగుతారు.  

ఈ సొరంగమార్గం చాలా ప్రత్యేకమైనది. సముద్రమట్టానికి సుమారు 10,000 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ సొరంగమార్గం ప్రపంచంలోకెల్ల ఎత్తైనది. రూ.3,300 కోట్లు వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ సొరంగమార్గం పొడవు 9.2కిమీ. దీనిలో ప్రతీ 150 మీటర్లకు ఒక టెలిఫోన్ పాయింట్, ప్రతీ 60 మీటర్లకు అగ్నిమాపక వ్యవస్థ, ప్రతీ 250 మీటర్లకు సీసీ కెమెరా, సొరంగంలోకి వెలుతురు ప్రసరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, గాలి నాణ్యతను పరిశీలించే వ్యవస్థ, ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే అప్రమత్తం చేసే అత్యవసర వ్యవస్థ వంటివి ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి లేహ్ లను కలుపుతూ నిర్మించిన ఈ సొరంగా మార్గంతో సుమారు 45 కిమీ దూరం తగ్గుతుంది.


Related Post