కేసీఆర్‌ కత్తికి రెండు వైపులా పదునే

October 02, 2020


img

ఈ నెల 6వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాగునీటిశాఖల ఉన్నతాధికారులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. నదీజలాల పంపకాలపై  ఇరు రాష్ట్రాల మద్య నెలకొన్న వివాదాలపై సామరస్యంగా చర్చించి పరిష్కారాలు కనుగొనడం కోసం కేంద్రప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించబోతోంది. అయితే సిఎం కేసీఆర్‌ ఆ సమావేశంలో పొరుగు రాష్ట్రం ఏపీకి, కేంద్రానికి గట్టిగా బుద్ధి చెపుతానని మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా చేశారు. ‘తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఆ దేవుడితోనైనా యుద్దం చేస్తా’ననే పంచ్ డైలాగ్ కూడా చెప్పారు. 

ఏపీ ప్రభుత్వం కోరుండి తెలంగాణతో కయ్యాలు పెట్టుకొంటోంది కనుక మళ్ళీ తెలంగాణ వైపు కన్నెత్తి చూడకుండా దానికి ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గట్టిగా బుద్ధి చెపుతానని సిఎం కేసీఆర్‌ అధికారులతో అన్నారు. అలాగే ఏపీ, తెలంగాణలు విడిపోయి ఆరేళ్లు గడిచిపోయినా ఇంతవరకు రెండు రాష్ట్రాల మద్య నదీజలాల పంపకాల ప్రక్రియను పూర్తి చేయకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్ళ కోసం కీచులాడుకొంటుంటే ప్రేక్షకపాత్ర పోషిస్తున్న కేంద్రప్రభుత్వాన్ని కూడా ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కడిగిపారేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. కనుక ఆ సమావేశంలో తెలంగాణ వాదనలను బలంగా వినిపించి ఏపీ, కేంద్రప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సమగ్ర సమాచారంతో సాగునీటిశాఖ అధికారులు సిద్దం కావాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

తెలంగాణ సాగునీరు, రైతుల ప్రయోజనాలను కాపాడుకోవాలనుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరపున బలంగా వాదనలు వినిపించాల్సిందే. అయితే ఆ విషయాలకు మీడియాలో మంచి కవరేజ్ వచ్చేలా చేసుకోవాలనుకోవడం గమనిస్తే సిఎం కేసీఆర్‌ ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. 

త్వరలో దుబ్బాక ఉపఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, కేవలం టిఆర్ఎస్‌ మాత్రమే రైతుల ప్రయోజనాలను కాపాడగలదని గట్టిగా వాదిస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశం గురించి సిఎం కేసీఆర్‌ చెపుతున్న మాటలు కూడా అందుకేననుకోవచ్చు. 

సిఎం కేసీఆర్‌ అవసరమనుకొంటేనే ఏ విషయం గురించైనా గట్టిగా మాట్లాడుతారు లేకుంటే ఒక్క ముక్క కూడా మాట్లాడారని తెలుసు. కనుక అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఏమి మాట్లాడబోతున్నారో ముందుగానే మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చేయడం బహుశః దుబ్బాక ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నదే కావచ్చు. ఒకవేళ ఇప్పుడు దుబ్బాక ఎన్నికలు లేకుంటే ‘అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి చర్చించారు,” అని మాత్రమే మీడియాలో వార్త వచ్చి ఉండేదేమో? ఏది ఏమైనపటికీ సిఎం కేసీఆర్‌ కత్తికి రెండువైపులా పదునే అని మరోసారి నిరూపిస్తున్నారు.


Related Post