కృష్ణయ్య కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి సై?

October 02, 2020


img

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారా? అంటే అవుననుకోవాలేమో. రాష్ట్రంలోని తొమ్మిది నిరుద్యోగ సంఘాల గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యి ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని కోరుతూ ఓ తీర్మానం చేసి ఆమోదించాయి. దశాబ్ధాలుగా బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న ఆయన ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెడితే బీసీల సమస్యలపై గట్టిగా మాట్లాడగలరని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీల వెంకటేష్ అన్నారు. అందుకే ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పకుండా పోటీ చేయాలని కోరారు. ఆయన పోటీ చేసేందుకు అంగీకరిస్తే నిరుద్యోగ యువత అందరూ ఆయన వెంట నిలిచి గెలిపించుకొంటామని నీల వెంకటేష్ అన్నారు. 

ఆర్‌.కృష్ణయ్య బీసీల ప్రయోజనాల కోసం చాలా ఏళ్లుగా పోరాడుతున్న మాట వాస్తవమే. అయితే ఆయన 2014 శాసనసభ ఎన్నికల సమయంలో టిడిపి ఆయనను ప్రత్యక్షరాజకీయాలలోకి దింపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన ఫక్తు రాజకీయనేతగా మారిపోయారు. ఆ ఎన్నికలలో టిడిపి గెలవనప్పటికీ ఆయన గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తరువాత క్రమంగా టిడిపికి దూరమయ్యి టిఆర్ఎస్‌కు దగ్గరయ్యారు. కానీ ఎందుకో టిఆర్ఎస్‌కు కూడా దూరం అయ్యారు. ఆ తరువాత 2018 ముందస్తు శాసనసభ ఎన్నికలలో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, ఒకసారి రాజకీయాలలో ప్రవేశించినవారు వాటికి దూరంగా ఉండలేరు కనుక ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆర్‌.కృష్ణయ్య తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకోవాలనుకొంటున్నారేమో? ఆయన కూడా బరిలో దిగితే ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతాయి. 


Related Post