కాంగ్రెస్‌ అస్త్రం కూడా అదే కానీ...

October 01, 2020


img

2018లో ముందస్తు శాసనసభ ఎన్నికలు, ఆ తరువాత వరుసగా లోక్‌సభ, పంచాయతీ ఎన్నికలు అన్ని జరిపించేస్తే మళ్ళీ నాలుగున్నరేళ్ళు మరే ఏ ఎన్నికలు ఉండవని కనుక పూర్తిగా పరిపాలనపై దృష్టి సారించవచ్చునని సిఎం కేసీఆర్‌ పదేపదే చెప్పారు. కానీ మళ్ళీ వరుసగా దుబ్బాక ఉపఎన్నికలు, శాసనమండలి ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్ ఎన్నికలు వచ్చేశాయి. సోలిపేట రామలింగా రెడ్డి ఆకస్మిక మృతితో దుబ్బాక ఉపఎన్నికలు రాగా మిగిలినవన్నీ వాటి గడువు ప్రకారమే జరుగుతున్నాయి. ముందుగా నవంబర్‌ 3వ తేదీన దుబ్బాక ఉపఎన్నికలు జరుగబోతున్నందున రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల వాతావరణం వచ్చేసింది. దాంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షపార్టీలు అన్ని విషయాలను పక్కనపెట్టి ఎన్నికల హడావుడిలో పడిపోయారు. 

ఎన్నికలంటే ఎప్పుడూ ముందుండే టిఆర్ఎస్‌ ఇప్పుడూ ప్రతిపక్షాల కంటే ముందే రంగంలోకి దిగి దూసుకుపోతోంది. దుబ్బాకలో బిజెపి హడావుడి కూడా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ కాస్త ఆలస్యంగా రంగంలో దిగుతున్నా నేరుగా అస్త్రశస్త్రాలతో యుద్ధభూమికి వచ్చేసేందుకు సన్నాహాలు చేసుకొంటోంది. దానిలో భాగంగానే శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో గంజి మైదానంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించబోతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రం తెచ్చిన వ్యవసాయబిల్లులనే అస్త్రాలుగా చేసుకొని దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపిలపై ప్రయోగించబోతోంది. అయితే దానిని టిఆర్ఎస్‌ ఇప్పటికే వాడేసుకొంటుంటే, కాంగ్రెస్‌ దానిని మరో విధంగా ఉపయోగించుకోబోతోంది.  

వ్యవసాయ బిల్లుల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారనే వాదనతో బిజెపిని, ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి లోపాయికారిగా కేంద్రప్రభుత్వానికి సహకరిస్తోందంటూ టిఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోందని దామోదర రాజనరసింహ తాజా వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మొదటి నుంచి కేంద్రప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించినట్లు నటించినప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్న దాఖలాలు లేవు. అందుకే దేశవ్యాప్తంగా రైతులు దానిని వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ ఊసే లేదు. టిఆర్ఎస్‌ ద్వంద వైఖరికి ఇది ఒక తాజా నిదర్శనం. ఈ విషయంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం వైఖరి ఏవిధంగా ఉన్నా రాష్ట్రంలో, దేశంలో రైతులకు తీవ్ర నష్టం కలిగించే ఈ వ్యవసాయబిల్లులను కాంగ్రెస్ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. తెలంగాణతో సహా  దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించి ఆ రైతువ్యతిరేక బిల్లులను అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తాము. రెండు రోజులలో దుబ్బాక ఉపఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్ధిని ప్రకటిస్తాము,” అని చెప్పారు. 

కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌లు వ్యవసాయబిల్లులను ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవడం సహజమే కానీ ఎన్నికల తరువాత కూడా రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఆ బిల్లులను వ్యతిరేకిస్తూ అవి ఇంతే పట్టుదలతో కేంద్రంతో పోరాడుతాయా లేదో చూడాలి.


Related Post