దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారులో మద్యం సీసాలు!

October 01, 2020


img

ఏపీలో ప్రసిద్ద పుణ్యక్షేత్రాలలో ఒకటైన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం తరచూ వివాదాలకు కేంద్రంగా నిలుస్తుండటం చాలా శోచనీయం. అమ్మవారి వెండిరధంలోని మూడు వెండి సింహాల బొమ్మల దొంగతనం కేసు ఇంకా సద్దుమణగక మునుపే మరో వివాదం చెలరేగింది. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి కారులో 223 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. వాటిని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

తెలంగాణలో మద్యం ధరలపై 16 శాతం, ఏపీలో మద్యం 65 శాతం పన్ను విధించినప్పటి నుంచి అనేకమంది తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి భారీగా మద్యం కొని ఏపీలో రెట్టింపు ధరలకు అమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. ఒక్కో వ్యక్తి పొరుగు రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలను ఏపీలోకి తెచ్చుకోవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పడంతో మద్యం అక్రమరవాణాకు కొంతమేర చట్టబద్దత కూడా ఏర్పదిండి. దాంతో కొంతమందికి ఇదే జీవనోపాధిగా మారిందంటే అతిశయోక్తి కాదు. అయితే ఉన్నత పదవులలో ఉన్నవారు సైతం ఈవిదంగా అడ్డుదారిలో సులువుగా డబ్బు సంపాదించాలనుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

పోలీసులు కారులో మద్యం సీసాలను పట్టుకొన్నప్పుడు ఆ కారు తమది కాదని వాదించిన నాగవరలక్ష్మి, ఇప్పుడు తనకు తెలియకుండా కారు డ్రైవరు తన కారులో మద్యం సీసాలను తరలించాడని వాదిస్తున్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు టిడిపి నేతలు తనను అప్రదిష్టపాలుజేసేందుకే తన కారు డ్రైవరుతో కలిసి ఈ కుట్రపన్నారని ఆమె ఆరోపించారు. కారు డ్రైవరును పోలీసులకు అప్పగించామని, పోలీసుల విచారణలో అతను తన తప్పును ఒప్పుకొన్నాడని నాగవరలక్ష్మి చెప్పారు.

తనపై ఈ అపనింద పడినందున విచారణ పూర్తయ్యేవరకు పదవిలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్నానని అందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. తన రాజీనామా లేఖను ఆలయట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పైల సోమినాయుడికి పంపించానని దానిని ఆయన ఆమోదించారని నాగవరలక్ష్మి తెలిపారు.     

అయితే వైసీపీ నేతగా ఉన్న ఆమె భర్త వెంకటకృష్ణ ప్రసాద్, తన భార్య పదవి, హోదాను అడ్డుపెట్టుకొని అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుబడ్డారని కానీ డ్రైవరును పోలీసులకు అప్పజెప్పి తెలివిగా తప్పించుకొన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పట్టుబడింది అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు కూడా ఈ వ్యవహారం పైకి పొక్కకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారని కానీ మీడియాకు ఈ వార్త పొక్కడంతో తప్పనిసరి పరిస్థితులలో నాగవరలక్ష్మి పేరును బయటపెట్టినట్లు సమాచారం.


Related Post