మళ్ళీ తెరపైకి కడియం శ్రీహరి?

October 01, 2020


img

గత టిఆర్ఎస్‌ ప్రభుత్వంలో ఓ వెలుగువెలిగి 2018 శాసనసభ ఎన్నికల తరువాత పక్కన పెట్టబడిన అనేకమంది టిఆర్ఎస్‌ సీనియర్ నేతలలో కడియం శ్రీహరి కూడా ఒకరు. మాజీ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రిగా ఆయన ప్రభుత్వంలో చాలా కీలకపాత్ర పోషించారు. ఆ తరువాత ఆయనను లోక్‌సభ లేదా రాజ్యసభకు పంపించవచ్చని లేదా ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకోవచ్చునని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి కానీ సుమారు రెండేళ్ళుగా టిఆర్ఎస్‌ ఆయనను పట్టించుకోలేదు. కానీ ఆయన కూడా టిఆర్ఎస్‌ అధిష్టానంపై బహిరంగంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. అసంతృప్తి వ్యక్తం చేయలేదు. బహుశః అందుకే మళ్ళీ ఆయనకు అవకాశం లభించబోతోందేమో? 

వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ మరియు వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలలో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. టిఆర్ఎస్‌లో వాటి కోసం చాలా మంది పోటీ పడుతున్నారు కూడా. అయితే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, నూటికి నూరుశాతం గెలిచే అవకాశం ఉన్న గెలుపుగుర్రాలకు మాత్రమే ఆ అవకాశం ఇవ్వాలని భావిస్తునందున వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకం నుంచి కడియం శ్రీహరికి ఆ అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

కడియం గతంలో విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు రాష్ట్రంలో విద్యావ్యవస్థను బాగుచేయడానికి చాలా కృషి చేశారు. కనుక ఆ మూడు జిల్లాలలో విద్యారంగంతో సంబందం ఉన్నవారందరితో మంచి పరిచయాలున్నాయి. మూడు జిల్లాల రాజకీయాలపై కూడా ఆయనకు మంచి పట్టుంది. పైగా ఆయనది మచ్చలేని రాజకీయ జీవితం. పదవి, అధికారం ఉన్నా లేకపోయినా చాలా నిరాడంబరంగా జీవిస్తూ అందరితో కలుపుగోలుగా ఉంటారనే మంచి పేరుంది. కనుక ఆయనే తగిన వ్యక్తి అని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భావిస్తే ఆశ్చర్యం లేదు.         

తాజా సమాచారం ప్రకారం కేటీఆర్‌ ఆయనకు కబురు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే తనకు బదులు తన కుమార్తె కావ్యకు ఆ అవకాశం ఇవ్వాలని కడియం కోరగా అందుకు కేటీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీనిని టిఆర్ఎస్‌ అధికారికంగా దృవీకరించవలసి ఉంది.


Related Post