ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నా: ప్రొ.నాగేశ్వర్

October 01, 2020


img

మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను పోటీ చేయడంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండటంతో వాటిపై స్పష్టత ఇచ్చేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. “నేను హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేయబోతున్నాను. నాకు అనేక ప్రజాసంఘాలు మద్దతు ఇస్తున్నాయి,” అని చెప్పారు. 

ప్రొఫెసర్ నాగేశ్వర్ 2007,2009లో వరుసగా రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి మండలికి ఎన్నికయ్యారు. 2014 వరకు మండలిలో సభ్యుడుగా ఉన్నారు. ఆయన ఏ పార్టీలోను చేరనప్పటికీ, ప్రజాసమస్యలపై ఆయనకున్న మంచి అవగాహన, బహిరంగ వేదికలపై వాటి గురించి మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీయగల ధైర్యం, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విధానాలను నిష్పక్షపాతంగా విశ్లేషిస్తూ మంచిని మంచి అని, చెడును చెడు అని ధైర్యంగా వివరించే ఆయన వైఖరి ప్రజలను కూడా ఆకట్టుకొంటుంది. అందుకే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో వామపక్షాలు ఆయనకు మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నాయి. ఆయన బరిలో ఉండటం ఖాయం అని స్పష్టం చేశారు కనుక కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌, బిజెపిలకు గట్టిపోటీ ఎదుర్కోకతప్పదు. 


Related Post