బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అసదుద్దీన్

September 30, 2020


img

బాబ్రీ మసీదు కూల్చివేతపై సుమారు 3 దశాబ్దాల సుదీర్గ విచారణ తరువాత లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ్ళ తుది తీర్పు ప్రకటించింది. బాబ్రీ మసీదును కుట్రపూరితంగా కూల్చివేశారనే ఆధారాలు లేనందున ఆ కేసులో నిందితులుగా పేర్కొనబడిన బిజెపి, విశ్వహిందూ పరిషత్, సంఘ్ సభ్యులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసమాతృప్తి వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బాబ్రీ మసీదు కూల్చివేయడానికి ఎటువంటి కుట్ర జరుగలేదని న్యాయస్థానం చెప్పింది. అయితే బాబ్రీ మసీదును ఎవరు కూల్చివేశారు? ఎవరూ కూల్చకపోతే దానంతట అదే కూలిపోయిందా?బాబ్రీ మసీదును ఎవరు కూల్చివేశారో... దాని వలన వారు ఏవిధంగా రాజకీయలబ్ది పొందారో యావత్ లోకానికి తెలుసు. అయిన అది కుట్ర కాదని సిబిఐ కోర్టు తీర్పు చెప్పడం చాలా బాధాకరం. బాబ్రీ మసీదు కూల్చివేతపై సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా సిబిఐ కోర్టు పట్టించుకోకుండా ఈవిధంగా అందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం విస్మయం కలిగిస్తుంది. ఈరోజు భారతీయ న్యాయచరిత్రలో బ్లాక్-డేగా మిగిలిపోతుంది,” అని అన్నారు. 

ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు మౌలానా సాజిత్ రషీద్ మీడియాతో మాట్లాడుతూ, “ఇటువంటి తీర్పు వస్తుందని మేము ముందే ఊహించాము. చివరికి మా ఊహే నిజమైంది. ఈ కేసులో సాక్ష్యాధారాలు, నిందితులు అందరూ కళ్ళ ముందే ఉన్నా కూడా వారు దోషులని నిరూపించే ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు తీర్పు చెప్పడం చాలా బాధాకరం. దోషులను కాపాడేవిధంగా ఉన్న ఇటువంటి తీర్పుల వలన న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.


Related Post