టీఎస్‌ఆర్టీసీలో ఇంకా అశ్వథామరెడ్డి హవా?

September 29, 2020


img

రాష్ట్ర ప్రభుత్వం, కార్మికుల నుంచి ఎన్ని ఒత్తిళ్ళు, విమర్శలు ఎదురైనప్పటికీ 55 రోజులపాటు ఏకధాటిగా ఆర్టీసీ సమ్మె జరిపించారు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి అశ్వథామ రెడ్డి. అయితే టీఎస్‌ఆర్టీసీలో యూనియన్లు ఉండరాదనే షరతుతో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకొంది. కానీ అశ్వత్థామరెడ్డి విధులకు హాజరుకానప్పటికీ నేటికీ ఆయన యూనియన్ నేతృత్వం వహిస్తుండటం విశేషం.

యూనియన్‌ కొనసాగుతున్నందున జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం మొన్న ఆదివారంనాడు హైదరాబాద్‌లో సమావేశమై ప్రధాన కార్యదర్శిగా అశ్వథామ రెడ్డి కొనసాగాలని తీర్మానం చేశారు. అయితే అశ్వథామ రెడ్డి ఉద్యోగం వదులుకొంటున్నందున ఆ పదవి నుంచి కూడా తప్పుకోవాలని థామస్ రెడ్డి అనే టిఎంయు నేత డిమాండ్ చేస్తున్నారు. కానీ అశ్వథామ రెడ్డి కొనసాగుతారని ఆయనకు రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పూర్తి మద్దతు తెలిపారని హైదరాబాద్‌ రీజియన్‌కు చెందిన యూనియన్ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చేసిన తీర్మానానికి అందరూ కట్టుబడి ఉండాలని వారు థామస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

టీఎస్‌ఆర్టీసీలో అసలు యూనియన్లే ఉండరాదని ప్రభుత్వం ఆదేశిస్తే, యూనియన్ నేతలు పదవుల కోసం కీచులాడుకొంటుండటం విచిత్రంగా ఉంది. కానీ ఇదివరకులా అటు యూనియన్ల అండలేకుండా, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టీఎస్‌ఆర్టీసీ కార్మికులు తమ గోడు ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక బాధ పడుతున్నారు.


Related Post