త్వరలో భారత్‌కు మరో 5రఫేల్ యుద్ధ విమానాలు?

September 29, 2020


img

భారత్‌-చైనాల సరిహద్దు వివాదం, సైనికులు, ఆయుధాల మోహరింపుపై ఇరుదేశాల మద్య వరుసగా అనేకసార్లు ఉన్నతస్థాయి సమావేశాలు జరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా చైనా యుద్ధసన్నాహాలు చేస్తుండటంతో భారత్‌ కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేసుకోక తప్పనిసరైంది. ఇప్పటికే ఆకాష్ వంటి క్షిపణులను సరిహద్దులవద్ద మోహరించిన కేంద్రప్రభుత్వం తాజాగా 1,000 కిమీ దూరంలోని లక్ష్యాలను అవలీలగా చేదించగల నిర్భయ్‌ క్షిపణిని కూడా మోహరించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకొన్న అత్యాధునాతమైన రఫేల్ యుద్ధ విమానాలను కూడా  రంగంలో దించింది. కానీ చైనాను ఎదుర్కొనేందుకు అవి సరిపోవు కనుక వీలైనంత త్వరగా మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలను అందించవలసిందిగా ఫ్రాన్స్‌ను కోరగా అందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 

భారత్‌లోని ఆ దేశపు రాయబారి ఇమ్మనియెల్ లెనిన్ సోమవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే నెలలో మరో 5 రఫేల్ యుద్ధ విమానాలను అందించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాము. వాటి నిర్మాణం పూర్తిచేసుకొని ప్రస్తుతం వివిద రకాల పరీక్షలను ఎదుర్కొంటున్నాయి. అవి పూర్తికాగానే వాటిని భారత్‌ చేతికి అప్పగిస్తాము. రఫేల్ యుద్ధ విమానాలను నడుపడంలో భారత్‌ పైలట్ల ప్రతిభ అమోఘం. ఇంత తక్కువ సమయంలో వారు అటువంటి అత్యాధునాతమైన యుద్ధవిమానాలను అలవోకగా నడుపగలగడం చూసి మేము కూడా ఆశ్చర్యపోయాము. భారత్‌ పైలట్ల చేతిలో అవి అమోఘమైన ఆయుధాలుగా మారుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు,” అని అన్నారు.


Related Post