దుబ్బాక నుంచి బిజెపి అభ్యర్ధిగా రఘునందన్ రావు ఖరారు?

September 29, 2020


img

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చి పడిన దుబ్బాక ఉపఎన్నికలలో మళ్ళీ ఆ సీటును దక్కించుకోవడం టిఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. కనుక మంత్రి హరీష్‌రావుతో సహా పలువురు టిఆర్ఎస్‌ నేతలు దుబ్బాకను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి ఇంకా అభ్యర్ధిని ప్రకటించనప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు పేరును దాదాపు ఖరారు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశః అందుకే ఆయన దుబ్బాక నియోజకవర్గంలో కలియతిరుగుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారనుకోవచ్చు. ఆయనే తమ ప్రత్యర్ధి అని టిఆర్ఎస్‌ కూడా భావిస్తున్నట్లే ఉంది. దుబ్బాక ఉపఎన్నికలలో రఘునందన్ రావు నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది కనుకనే టిఆర్ఎస్‌ కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయబిల్లులను అస్త్రాలుగా బిజెపిపై సంధిస్తున్నట్లుంది. కానీ ఎల్.ఆర్.ఎస్.తో నిరుపేదలపై టిఆర్ఎస్‌ భారం మోపిందనే వాదనతో రఘునందన్ రావు టిఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, నిరుద్యోగ భృతి హామీల గురించి గట్టిగా మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

పార్టీ వ్యవహారాలకు ఎప్పుడూ దూరంగా ఉండే బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ రఘునందన్ రావుపై అభిమానంతో దుబ్బాకలో ఓసారి పర్యటించి ప్రచారం చేసి వెళ్ళారు. దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ లక్షకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తుందని సిఎం కేసీఆర్‌ జోస్యం చెప్పారు. కానీ లోక్‌సభ ఎన్నికలలోలాగే ఈసారి కూడా టిఆర్ఎస్‌ అభ్యర్ధిని ఓడించి సిఎం కేసీఆర్‌కు గట్టి షాక్ ఇవ్వాలని బిజెపి నేతలు చాలా పట్టుదలగా ఉన్నారు. అభ్యర్ధి పేరు ప్రకటించాగానే బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ కూడా దుబ్బాకలో పర్యటించి ప్రచారం చేసేందుకు ఎదురుచూస్తున్నారు. నేడో రేపో కాంగ్రెస్‌ పార్టీ కూడా తన అభ్యర్ధిని ప్రకటిస్తే కాంగ్రెస్‌ నేతలు కూడా రంగంలో దిగుతారు కనుక త్వరలోనే దుబ్బాకలో ఎన్నికల వేడి అమాంతం పెరిగిపోవడం ఖాయం.


Related Post