కోదండరాం వలనే టిఆర్ఎస్‌ బలపడుతోంది: చల్మారెడ్డి

September 29, 2020


img

తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి ప్రజలను నడిపించినవారిలో ప్రొఫెసర్ కోదండరాం కూడా ఒకరని అందరికీ తెలుసు. ఆ తరువాత తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి ప్రత్యక్షరాజకీయాలలోకి ప్రవేశించారు కానీ ఉద్యమ సమయంలో పొందిన ప్రాముఖ్యత, ప్రజాధారణ ఇప్పుడు పొందలేకపోతున్నారు. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని పోటీ చేసి ఘోరపరాజయం పాలైన తరువాత తెలంగాణ జనసమితి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. త్వరలో దుబ్బాక, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ మునిసిపాలిటీలకు వరుసగా ఎన్నికలు జరుగనున్నాయి. కానీ నేటికీ తెలంగాణ జనసమితి పరిస్థితి ఎటువంటి మార్పు లేకపోవడంతో ఏ ఎన్నికలలో కూడా ఒంటరిగా పోటీ చేయలేని దుస్థితిలో ఉంది. ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని భావించి కాంగ్రెస్‌ మద్దతు కోరుతూ లేఖ వ్రాస్తే దానిని కాంగ్రెస్‌ తిరస్కరించింది. ఒకవేళ పోటీచేసి ఓడిపోయినా, పోటీ చేయకపోయినా పార్టీకి మరింత అప్రదిష్ట. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. కనుక తెలంగాణ జనసమితికి ఈ వరుస ఎన్నికలు వరుస అగ్నిపరీక్షలు వంటివేనని చెప్పక తప్పదు.

తెలంగాణ జనసమితి రైతు విభాగం అధ్యక్షుడు వెదిరె చల్మారెడ్డి సోమవారం పార్టీని వీడి తెలంగాణ ఇంటిపార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చల్మారెడ్డి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ప్రొఫెసర్ కోదండరాం నాయకులను తయారుచేయగలరు కానీ పార్టీని నడిపించలేరు. ఉద్యమసమయంలో ఆయన కేసీఆర్‌ ఎదుగుదలకు తోడ్పడ్డారు. ఆ తరువాత 2014 ఎన్నికలలో కేసీఆర్‌ కోదండరాంను వాడుకొని అధికారం చేజిక్కించుకొన్నారు. గత ఆరేళ్ళలో కోదండరాం అసమర్దత వలననే రాష్ట్రంలో టిఆర్ఎస్‌ బలపడిందని నేను భావిస్తున్నాను. ఒంటెద్దు పోకడలతో పార్టీని నడిపిస్తుండటం వలన ఇన్నేళ్ళయినా పార్టీ బలపడలేకపోయింది. ఎన్నికలను ఎదుర్కొలేని దుస్థితిలో ఉంది. టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ జనసమితి ఘోరంగా విఫలమైంది. అందుకే నేను పార్టీని వీడక తప్పలేదు,” అని అన్నారు. 


Related Post