టిఆర్ఎస్‌ నిజంగానే ఆ బిల్లును వ్యతిరేకిస్తోందా?

September 28, 2020


img

కేంద్రప్రభుత్వం తెచ్చిన రెండు వ్యవసాయ బిల్లుల వలన దేశంలో రైతులు నష్టపోతారు కనుక వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టిఆర్ఎస్‌ పార్లమెంటులో విస్పష్టంగా చెప్పింది. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వాటిని వ్యతిరేకిస్తూ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు వినతి పత్రం ఇద్దామని సోమవారం పాదయాత్రగా బయలుదేరినప్పుడు వారిని దారిలో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి ఘోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న తమను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. “ప్రతిపక్ష  నేతలు గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కూడా వీలులేదా? టిఆర్ఎస్‌ వ్యవసాయబిల్లులను వ్యతిరేకిస్తోందని చెప్పుకొంటుంది. కానీ ఈ విషయంలో దానికి చిత్తశుద్ధి లేదని అర్ధమైంది,” అని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  

ఒకవేళ ఈ సమస్యపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వారిని కలవకూడదనుకొంటే తప్ప వారిని అడ్డుకోవలసిన అవసరం ఏంటి?ఇటువంటి సమస్యలపై టిఆర్ఎస్‌ అభిప్రాయాలతో, వాదనలతో ఏకీభవించేపార్టీలను కలుపుకొని జాతీయస్థాయిలో పోరాడాలనుకొంటున్నప్పుడు, కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకోవడం రాజకీయమే అనుకోవాలేమో?వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్‌ దుబ్బాక ఉపఎన్నికలలో అస్త్రంగా వినియోగించుకోవాలనుకొంటోంది కనుక కాంగ్రెస్‌ కూడా దానిని వినియోగించుకోవడం ఇష్టం లేకనే అడ్డుకొందనుకోవాలేమో?అదే నిజమైతే ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించిన్నట్లు వ్యవసాయ బిల్లులను అడ్డుకొనే విషయంలో టిఆర్ఎస్‌ చిత్తశుద్దిని శంఖించక తప్పదు. అన్నిటి కంటే విచిత్రమైన విషయమేమిటంటే కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను చేర్చుకోవడానికి టిఆర్ఎస్‌కు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ‘కాంగ్రెస్ పార్టీ’ని మాత్రం ద్వేషిస్తుండటం!


Related Post