దుబ్బాకలో టిఆర్ఎస్, కాంగ్రెస్‌ కుమ్మక్కు: డికె.అరుణ

September 28, 2020


img

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన తరువాత డికె.అరుణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను సమర్ధంగా నిర్వర్తిస్తాను. రాష్ట్ర అధ్యక్ష ప్రయత్నించిన మాట వాస్తవమే కానీ అది రానందుకు నిరాశపడలేదు. తెలంగాణలో బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తాను. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపియే తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ పార్టీలో కొందరు  టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఒత్తిళ్ళు భరించలేక టిఆర్ఎస్‌లో చేరిపోతే మిగిలినవారిలో కొందరు లోపాయికారిగా టిఆర్ఎస్‌కు సహకరిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఓటేయమని కొందరు కాంగ్రెస్‌ నేతలే ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. టిఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కయిందని చెప్పడానికి అదే తాజా నిదర్శనం. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయినప్పటికీ దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి తప్పకుండా గెలుస్తుందని నమ్ముతున్నాను. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి తన సత్తాచాటబోతోంది. 

సిఎం కేసీఆర్‌ పాలనపై ప్రజల భ్రమలు తొలగిపోయాయి. ఆయన మాయమాటలతో ప్రజలను వంచిస్తున్నారనే సంగతి అందరికీ తెలిసివచ్చింది. కనుక ప్రజలు టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బిజెపివైపే చూస్తున్నారు. ఈవిషయం టిఆర్ఎస్‌ కూడా గ్రహించింది. అందుకే టిఆర్ఎస్‌ నేతలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించే వంకతో బిజెపిని, కేంద్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ ప్రజలను మళ్ళీ ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు గడిచినా ఇంతవరకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కట్టకుండా కాలక్షేపం చేస్తోంది. కనుక వ్యవసాయబిల్లులను వ్యతిరేకించే అర్హత టిఆర్ఎస్‌కు లేదు,” అని విమర్శించారు.


Related Post