సినిమా థియేటర్లు ఇంకా ఎప్పుడు తెరుచుకొంటాయో?

September 28, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు గత 6 నెలలుగా మూతపడ్డాయి. కరోనా భయంతో నేటికీ తెరుచుకొనే పరిస్థితి కనిపించడం లేదు. థియేటర్లు తెరుచుకోలేదని వందల కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలను ఓటిటీ ప్లాట్‌ఫారంలో విడుదల చేస్తే గిట్టుబాటు కాదు. కనుక వచ్చే ఏడాది సంక్రాంతి, దసరా, దీపావళి పండుగ సీజనులో విడుదలయ్యేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకొంటున్నారు. దాంతో సినిమా షూటింగులు మండకోడిగా సాగుతున్నాయి. సినిమా షూటింగులు జోరుగా సాగుతుంటేనే సినీపరిశ్రమలో పనిచేస్తున్న వేలాదిమందికి పని, దాంతో ఆదాయం దొరుకుతుంది. కనుక వారందరూ కూడా ఇకనైనా సినిమా థియేటర్లు తెరుచుకోవాలని ప్రభుత్వాలను ఆర్ధిస్తున్నారు. అయితే సినిమా థియేటర్లు తెరిచేందుకు కేంద్రప్రభుత్వం ఇంతవరకు అనుమతించలేదు. 

కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం కేంద్రం అనుమతించకపోయినా అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో సినిమా థియేటర్లను తెరుచుకొనేందుకు అనుమతించింది. అయితే కరోనా నేపధ్యంలో సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లలోనే ప్రేక్షకులను అనుమతించాలని ఆదేశించింది. అలాగే కరోనా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని చెప్పింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించవలసి ఉంది. 

ఈ నెలాఖరుతో అన్‌లాక్‌-4 ముగిసి, అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్‌-5 మొదలవుతుంది కనుక ఒకవేళ వచ్చే నెల నుంచి అన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్లు తెరుచుకొనేందుకు కేంద్రం అనుమతిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ అన్‌లాక్‌-5లో కూడా సినిమా థియేటర్లు తెరుచుకొనేందుకు కేంద్రం అనుమతించకపోతే పశ్చిమ బెంగాలో  ప్రభుత్వం సైతం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోక తప్పదు. 


Related Post