కోదండరాంకు మద్దతు ఇవ్వలేము: కాంగ్రెస్‌

September 28, 2020


img

రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా   కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాణిక్యం ఠాగూర్‌, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేతలందరూ సమావేశమయ్యారు. దానిలో దుబ్బాక ఉపఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం మునిసిపల్ ఎన్నికల గురించి లోతుగా చర్చించారు. 

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ రెండు పట్టభద్రుల స్థానాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలో బలమైన అభ్యర్ధులున్నందున విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే నమ్మకం అందరూ వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి మండలిలో అడుగుపెట్టాలని భావిస్తున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్‌ మద్దతు కోరుతూ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఓ లేఖ వ్రాశారు. కాంగ్రెస్ పార్టీయే రెండు స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించినందున ఆయనకు మద్దతు ఇవ్వలేమని తెలపాలని నిర్ణయించారు. మరోపక్క సిపిఐ, సిపిఎంలు కూడా ఆ రెండు స్థానాలకు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నందున తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు అవి కూడా మద్దతు ఈయవు కనుక ఆయన స్వశక్తితో ఒంటరి పోరాటం చేసేందుకు సిద్దపడితేనే బరిలో దిగవలసి ఉంటుంది. ఇక ఈ ఎన్నికలలో బిజెపి కూడా తప్పకుండా పోటీ చేస్తుందని ఇదివరకే ప్రకటించింది. కనుక ఇన్ని పార్టీల అభ్యర్ధులు బరిలో దిగితే వాటి మద్య ఓట్లు చీలిపోయి, కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌కు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది.


Related Post