రాజన్న సిరిసిల్లాలో బోర్లలో నుంచి ఉబికివస్తున్న పాతాళగంగ

September 26, 2020


img

ఒకప్పుడు సాగునీటి కోసం ప్రధానంగా బోరుబావులపైనే ఆధారపడిన రైతులు, తమ పొలాలలో ఒక చోట నీళ్ళు పడకపోతే మరొకచోట... అక్కడా పడకపోతే మరోచోట... వరుసగా బోరుబావులు తవ్వించేవారు. 1,000-1,200 అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్ళు పడేవికావు. దాంతో వాటి కోసం చేసిన అప్పులను, వాటిపై వడ్డీలను చెల్లించలేక అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరికీ తెలుసు. 

కేసీఆర్‌ తెలంగాణ ఏర్పడకమునుపే ఈ సమస్య తీవ్రతను గుర్తించారు. రాష్ట్రం ఏర్పడి ఆయన ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టగానే ముందుగా రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్యను తీర్చి వెంటనే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందించి కొంతవరకు వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ భూమిలో నీళ్ళు లేకపోతే బోర్లలో నుంచి నీళ్ళు ఎలా వస్తాయి? అందుకే రాష్ట్రంలో 45,000కు పైగా పూడుకుపోయున్న చెరువులను ‘మిషన్ కాకతీయ పధకం’ క్రింద పూడికలు తీయించారు. వేలకోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తూ, నీటిచుక్క కానని పలు జిల్లాలకు 365 రోజులు నీళ్లు పారేలా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వరుసగా నిర్మించిన పలు ప్రాజెక్టులను కలుపుతూ భారీ కాలువలు తవ్వించారు. మళ్ళీ వాటి నుంచి గ్రామాలకు నీటిని మళ్లించేందుకు పిల్ల కాలువల తవ్వించారు. ఎక్కడికక్కడ సిద్దంగా ఉన్న చెరువులను ఆ నీటితో నింపేశారు. ఆ చెరువులలో ఏటా కోట్లాది చేప పిల్లలను వదులుతూ గ్రామాలలోని మత్స్యకారులకు ఉపాది లభించేలా చేశారు. 

ఇప్పుడు పలు జిల్లాలో కాలువలు, చెరువులు నీళ్ళతో కళకళలాడుతున్నాయి. ఆ కారణంగా భూగర్భజలాలు పెరిగాయి. ఎంతగా పెరిగాయంటే...రాజన్న సిరిసిల్లా జిల్లాలో కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో పంట పొలాలలో వేసిన నాలుగు బోరబావుల నుంచి మోటారు వేయకుండానే నీళ్ళు పైకి ఎగజిమ్మేంత! ఎప్పుడూ సాగునీటి కోసం కటకటలాడటమే తప్ప పుష్కలంగా నీటిని చూడని రైతన్నలు అది చూసి ఆనందంతో పొంగిపోతున్నారు. జిల్లాలో పలుగ్రామాలలో కొద్దిగా తవ్వేసరికే నీళ్ళు ఉబికివస్తుండటం చూసి రైతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకప్పుడు చుక్క నీటికి నోచుకోక బీడువారిన తెలంగాణ భూములలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు, బోరుబావులలో ఉబికివస్తున్న పాతాళగంగ, మరోపక్క ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పొంగి పొరలుతున్న వాగులు, వంకలతో తెలంగాణ రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ఇదంతా సిఎం కేసీఆర్‌ దూరదృష్టి, రాష్ట్రాన్ని బాగుచేసుకోవాలనే తపన, చిత్తశుద్ది, అంతే తపన, చిత్తశుద్ది, కార్యదీక్ష ఉన్న హరీష్‌రావు వంటి మంత్రి, సాగునీటిశాఖ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టి కృషి వలననే సాధ్యమైందని చెప్పవచ్చు. కనుక ఈ విజయానికి కారకులైన ప్రతీ ఒక్కరూ అభినందనీయులే.


Related Post