ఈనెల 29న దుబ్బాక ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటన?

September 26, 2020


img

కేంద్ర ఎన్నికల కమీషన్‌ శుక్రవారం బిహార్‌ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు, దుబ్బాకతో సహా దేశంలో ఖాళీగా ఉన్న 64 శాసనసభ స్థానాలకు, ఒక్ లోక్‌సభ స్థానానికి కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందని అందరూ ఎదురు చూశారు. కానీ వాటిపై ఈ నెల 29న సంబందిత రాష్ట్రాల ఎన్నికల సంఘాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తరువాత  షెడ్యూల్ ప్రకటించాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ నిర్ణయించింది. కనుక ఆదేరోజున లేదా మరుసటి రోజున ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 

బిహార్‌ శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7తేదీలలో మూడు దశలలో పోలింగ్ నిర్వహించి నవంబర్‌ 10న ఫలితాలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల కమీషన్‌ ప్రకటించింది. వాటితో పాటే దుబ్బాకతో సహా వివిద రాష్ట్రాలలోని 64 శాసనసభ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తామని ఇది వరకే చెప్పింది. కనుక దుబ్బాక ఉపఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్‌ 7 లేదా 9వ తేదీలలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. 

దుబ్బాక నుంచి టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి భార్యను టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నికలలో లక్షకు పైగా మెజార్టీతో టిఆర్ఎస్‌ గెలుస్తుందని సిఎం కేసీఆర్‌ జోస్యం చెప్పారు. ఇప్పటికే హరీష్‌రావుతో సహా పలువురు నేతలు దుబ్బాకలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు.  అప్పుడే టిఆర్ఎస్‌ పార్టీ అస్త్రశస్త్రాలను కూడా సిద్దం చేసుకొని కాంగ్రెస్‌, బిజెపిలపై ప్రయోగిస్తోంది కూడా. ఓ పక్క తమ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం గురించి గొప్పగా ప్రచారం చేసుకొంటూనే, మరోపక్క కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయబిల్లు, విద్యుత్ బిల్లులతో రైతులకు తీవ్రనష్టం కలుగుతుందంటూ ప్రచారం చేస్తోంది. కానీ కాంగ్రెస్‌, బిజెపిలు ఇంకా అభ్యర్ధుల వేటలోనే ఉన్నాయి కనుక అవి దుబ్బాకలో అడుగుపెట్టేసరికే టిఆర్ఎస్‌ సగం విజయం సాధించేసినా ఆశ్చర్యం లేదు. 


Related Post