మంత్రి కొడాలి నానికి బండి సంజయ్ చురకలు

September 25, 2020


img

ఏపీలో తిరుమల, కనకదుర్గమ్మ గుడి, అంతర్వేది ఆలయాలపై అధికార వైసీపీ నేతల తీరును తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పు పట్టారు. మతవిశ్వాసాలు, ఆచార వ్యవహారాలలో రాజకీయనాయకులు తలదూర్చకుండా ఉంటే మంచిదని అన్నారు. ఒకవేళ తలదూరిస్తే ప్రజలే వారికి తగినవిధంగా బుద్ది చెపుతారని అన్నారు. కనకదుర్గ గుడి, అంతర్వేది ఆలయంలో జరిగిన ఘటనలు చాలా బాధాకరమని, తిరుమలలో ఆచారవ్యవహారాలకు భంగం కలిగించడం లేదా ఆవిధంగా మాట్లాడటం సరికాదన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడవలసిన పాలకులు, ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడటం, వ్యవహరించడం సరికాదన్నారు. గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశ్యించి మంత్రి కొడాలి నాని అనుచితంగా మాట్లాడటం సరికాదన్నారు. ఆవిధంగా మాట్లాడుతున్నవారిని కట్టడి చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని అన్నారు. ఒకవేళ అటువంటి నేతలు, మంత్రులపై చర్యలు తీసుకోకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని గుర్తుంచుకోవాలని బండి సంజయ్‌ అన్నారు.

మంత్రి కొడాలి నానిని మంత్రిపదవిలో నుంచి బర్త్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఏపీ రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా స్పందించవలసి ఉంది.


Related Post