హైదరాబాద్‌లో రోడ్డెక్కిన సిటీ బస్సులు

September 25, 2020


img

సుమారు 185 రోజుల విరామం తరువాత మళ్ళీ ఇవాళ్ళ నుంచి హైదరాబాద్‌ నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు రోడ్డెక్కాయి. అయితే నేటికీ నగరంలో కరోనా వైరస్‌ వ్యాపించి ఉన్నందున మొత్తం బస్సులలో 25 శాతం మాత్రమే తిప్పాలనే టీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనకు సిఎం కేసీఆర్‌ నిన్న ఆమోదం తెలుపడంతో ఆ మేరకు సిటీ బస్సులు ఇవాళ్ళ ఉదయం 5 గంటల నుంచే రోడ్డెక్కాయి. మరో 10 రోజుల తరువాత పరిస్థితిని సమీక్షించి సానుకూలంగా ఉంటే 50 శాతం బస్సులను తిప్పుతామని రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. 

సుమారు ఆరు నెలల తరువాత సిటీ బస్సులు రోడ్డెక్కడంతో సామాన్య ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం సిటీ బస్సులు తిప్పకపోవడంతో తమ జీతాలు, ఉద్యోగాల గురించి తీవ్ర ఆందోళన చెందుతున్న సిటీ బస్సు డ్రైవర్లు, కండెక్టర్లు కూడా ప్రభుత్వ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా నేపధ్యంలో సిటీ బస్సులు డిపోల నుంచి బయలుదేరేముందు, తిరిగి వచ్చిన తరువాత పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. డ్రైవర్లు, కండెక్టర్లు మాస్కూలు, గ్లౌజులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ప్రస్తుతం ఒక సీటులో ఒకరు మాత్రమే కూర్చోనేందుకు అనుమతిస్తున్నారు. కానీ ఈవిధంగా 25శాతం సామర్ధ్యంతో సిటీ బస్సులను నడిపించడం వలన బస్సుల నిర్వహణ వ్యయం రాబట్టుకోవడం కూడా కష్టమే. కనుక బస్సు ప్రయాణికులకు, సిబ్బందికి కరోనా సోకకుండా పూర్తి సామర్ధ్యంతో ఏవిధంగా బస్సులు నడిపించాలో టీఎస్‌ఆర్టీసీ ఆలోచించుకోకతప్పదు.


Related Post