నేడే దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం

September 25, 2020


img

హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారిన దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ నేడే ప్రారంభం కాబోతోంది. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఉదయం దానిని ప్రారంబించనున్నారని జీహెచ్‌ఎంసీ నిన్న ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ ఆలీ, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కే.కేశవరావు, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఆరేకెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ అధికారులు హాజరవుతారు. 

ఈ కేబిల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్‌-45, మాదాపూర్ మద్య వాహనాల రాకపోకలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దుర్గం చెరువులో స్తంభాలు వేయకుండా బలమైన తీగలపై వ్రేలాడే విదంగా ఈ వంతెనను నిర్మించడంతో అది ప్రత్యేక ఆకర్షణగా మారింది. బ్రిడ్జికి అమర్చిన తీగలకు రంగురంగుల విద్యుత్ దీపాలు అమర్చడంతో రాత్రిపూట దానిపై ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. దిగువనున్న దుర్గం చెరువును కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దడంతో ఆ ప్రదేశమంతా పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది.   

రూ.184 కోట్లు వ్యయంతో నాలుగు లేన్లతో నిర్మించిన ఈ కేబిల్ బ్రిడ్జ్ పొడవు  735.64 మీటర్లు, వెడల్పు 425.85 మీటర్లు. అప్రోచ్ వయా డక్ట్ పొడవు 309.79 మీటర్లు. 


Related Post