ధరణి పోర్టల్‌ వచ్చిన తరువాతే రిజిస్ట్రేషన్స్: కేసీఆర్‌

September 24, 2020


img

రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలతో కూడిన ‘ధరణి పోర్టల్‌’ కూడా తీసుకువస్తోంది. అది కూడా సిద్దమయ్యేవరకు రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టరాదని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రెండువారాలలోగా రాష్ట్రంలో ఇళ్ళు, అపార్టుమెంట్‌లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయేతర భూముల వివరాలను సేకరించి ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కాస్త ఆలస్యమైనా ధరణి పోర్టల్‌ పూర్తి వివరాలతో అందుబాటులోకి వచ్చిన తరువాతే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిద్దామని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వెంటవెంటనే ఆ వివరాలు ధరణిలో అప్‌తాజా అప్‌డేట్స్ అవుతుంటాయి కనుక రాష్ట్రంలో స్థిరాస్తులకు సంబందించి సమగ్ర సమాచారం దానిలో నిక్షిప్తం అవుతుంటుందని సిఎం కేసీఆర్‌ అన్నారు. కనుక ప్రజలు తమ ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ధరణిలో నమోదు చేయడంతో పాటు యాజమాన్య హక్కులను తెలియేజేస్తూ పాసుపుస్తకాలు కూడా అందజేస్తామని చెప్పారు. భూముల క్రమబద్దీకరణ (రెగ్యులరైజేషన్), ఉచిత నాలా కనెక్షన్ పొందేందుకు ఇదే చివరి అవకాశామని సిఎం కేసీఆర్‌ చెప్పారు.  

ఇకపై వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు ఉచితంగా మ్యూటేషన్ (యాజమాన్యపు హక్కులు కొనుగోలుదారు పేరిట బదిలీ చేస్తూ ఇచ్చే పత్రం) ఉచితంగా చేస్తామని చెప్పారు. అయితే ఎండోమెంట్, వక్ఫ్ బోర్డు, ఎఫ్‌టీఎల్‌, నాలా, యూఎల్‌సీ పరిధిలో నిర్మించుకొన్న ఇళ్లకు మ్యూటేషన్ చేయబోమని చెప్పారు. 

రాష్ట్రంలో నోటరీ, జీవో 58 మరియు 59 పరిధిలోకి వచ్చే ఇళ్ళను కూడా ఉచితంగా క్రమబద్దీకరిస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో భూములు పరస్పర మార్పిడి పద్దతిలో కొనుగోలు చేసిన సాదాబైనామాలకు కూడా మరొక్కసారి ఉచితంగా మ్యూటేషన్ అవకాశం కల్పిస్తామని, దాని కోసం ఒకటి రెండు రోజులలో ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ఇక ముందు ఎట్టి పరిస్థితులలో సాదాబైనామాలను అనుమతించబొమని సిఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.


Related Post