15 రోజులలో అది సాధ్యమేనా?

September 23, 2020


img

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చినందున, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని ప్రతీ ఇల్లు, అపార్ట్మెంట్, వ్యవసాయేతర స్థలాలు తదితర స్థిరాస్థి వివరాలు 15 రోజులలోగా ధరణి పోర్టల్లోకి అప్‌లోడ్ చేయాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ధరణి పోర్టల్‌పై సిఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలోపే దానిలో అన్ని వివరాలను నింపి సమగ్రంగా తీర్చిదిద్దాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీనికోసం మునిసిపల్, పంచాయతీ శాఖలలోని అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇప్పటివరకు రికార్డులలో నమోదు కానీ స్థిరాస్తుల వివరాలపై అధికారులు, సిబ్బంది ప్రత్యేకదృష్టి పెట్టి నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా తమ స్థిరాస్తుల వివరాలను అధికారులకు తెలియజేసి ధరణి పోర్టల్లో నమోదు చేయించుకోవాలని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూ శాఖ వద్ద చాలావరకు ప్రజల స్థిరాస్తుల వివరాలున్నందున ఇప్పటికే వాటన్నిటినీ ధరణి పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేసి ఉంటే పరువాలేదు లేకుంటే 15 రోజులలో వాటన్నిటినీ అప్‌లోడ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. పైగా క్షేత్రస్థాయిలో పర్యటించి స్థిరాస్తుల వివరాలు సేకరించడానికి ఆ సమయం సరిపోదు. కనుక పాతవి, కొత్తవి రికార్డులన్నిటినీ 15 రోజులలోపుగా ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం కష్టమనే భావించవచ్చు. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలను కాదనలేక 15 రోజులలోనే అప్‌లోడ్ చేయవలసివస్తే దానిలో తప్పులు దొర్లే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల వివరాల నమోదులో తేడాలు వస్తే అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు కూడా ఇబ్బందిపడవలసి వస్తుంది. గతంలో 100 రోజులలో భూసర్వే, భూరికార్డుల ప్రక్షాళన, పట్టదార్ పాసు పుస్తకాల పంపిణీ చేసినప్పుడు అనేక తప్పులు దొర్లాయి. వాటిని సవరించుకొనేందుకు నేటికీ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కనుక ధరణి పోర్టల్‌లో స్థిరాస్తుల వివరాల నమోదుకు తగినంత సమయం ఇవ్వడం మంచిది. 



Related Post