దొంగ లెక్కలు...డెయిలీ సీరియల్

September 22, 2020


img

హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణంపై కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ఎక్కడ నిర్మించారో చూపమని అడిగితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపలేకపారిపోయారని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. వాటిపై తలసాని కూడా ఘాటుగా స్పందించారు. 

తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, “జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కడతాము. ఆ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. కాంగ్రెస్‌ నేతలను నేను స్వయంగా తీసుకువెళ్లి మా ప్రభుత్వం కట్టిన ఇళ్ళను చూపించేందుకు తీసుకువెళ్తుంటే వారు మద్యలోనే పారిపోయారు. హైదరాబాద్‌లో 111 చోట్ల ఇళ్ళ నిర్మాణం చురుకుగా సాగుతోంది. ప్రతిపక్షాలే కాదు...మీడియా ప్రతినిధులు కూడా అక్కడకు వెళ్ళి ఆ ఇళ్ళను చూడవచ్చు. నగరంలో స్థలాలు లేనందునే శివార్లలో ఇళ్ళు నిర్మిస్తున్నాము. వాటిలో 90 శాతం ఇళ్ళు జీహెచ్‌ఎంసీ పరిధిలో నివశిస్తున్నవారికి, మిగిలిన 10 శాతం స్థానికులకు కేటాయిస్తాము. ఇదివరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడూ ఇదేవిధంగా నగరం బయట ఇళ్ళు నిర్మించింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై డెయిలీ సీరియల్‌లాగా రోజూ మాట్లాడలేను,” అని అన్నారు. 

భట్టి విక్రమార్క ఇవాళ్ళ కాంగ్రెస్‌ నేతలతో కలిసి శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో అర్హులైన పేదలందరూ ఆత్మగౌరవంతో జీవించేందుకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్‌ ఆరున్నరేళ్ళయినా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేకపోయింది. హైదరాబాద్‌ నగరంలో ఏకంగా లక్ష ఇళ్ళు నిర్మించామని అబద్దాలు చెప్పి అడ్డంగా దొరికిపోయింది. టిఆర్ఎస్‌ ప్రభుత్వం మాకిచ్చిన నివేదికలో అన్నీ తప్పులు తడకలే... దొంగలెక్కలే. ఉదాహరణకు నాంపల్లిలో 1,824 ఇళ్ళు నిర్మించమని పేర్కొన్నారు. కానీ అక్కడ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. జీహెచ్‌ఎంసీలో ప్రతీ నియోజకవర్గంలో 10,000 చొప్పున ఇళ్ళు నిర్మిస్తామని సిఎం కేసీఆర్‌ 2016-17లో హామీ ఇచ్చారు. మొదట జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తామని గొప్పలు చెప్పుకొన్నారు తరువాత వాటిని లక్షకు తగ్గించారు. కానీ అవి కూడా కట్టలేకపోయారు. టిఆర్ఎస్‌ ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొంటుంది. అధికారంలోకి వచ్చేక ఆ హామీలను పట్టించుకోదని చెప్పడానికి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ హామీయే ఓ చక్కటి ఉదాహరణ,” అని అన్నారు.


Related Post