టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌, బిజెపి క్యాడర్

September 22, 2020


img

దుబ్బాక ఉపఎన్నికల గురించి కాంగ్రెస్‌, బిజెపిలు ఇంకా ఆలోచిస్తుండగానే అధికార టిఆర్ఎస్‌ రంగంలో దిగి పని మొదలుపెట్టేసింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు ఎన్నికలు ఏవైనప్పటికీ ప్రతీ ఎన్నికలను టిఆర్ఎస్‌ ప్రతిష్టాత్మకంగానే భావించి ఎదుర్కొంటుంటుందని అందరికీ తెలుసు. వాటిలో భాగంగానే సిఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్‌రావును రంగంలో దించారు. ఆయన నిన్న సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక మండలంలో పర్యటించి పలువురు కాంగ్రెస్‌, బిజెపి నేతలు, కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. దుబ్బాక నుంచి బిజెపి నేత, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు బూర శ్రీధర్, చెపూరి సాగర్ గౌడ్, బాలకృష్ణ, శ్రీరామాంజనేయులు తదితరులున్నారు. తొగుట నుంచి కాంగ్రెస్‌ నేతలు పబ్బతి మల్లారెడ్డి తదితరులు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరారు.

ఈ ఉపఎన్నికలలో ఘనవిజయం సాధించి అధికార టిఆర్ఎస్‌కు బుద్ది చెపుతామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపియేనని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పుకొంటుంటారు. కానీ కాంగ్రెస్‌, బిజెపిలు ఇంకా నిద్రలేవక మునుపే దుబ్బాకలో ఆ రెండు పార్టీలను టిఆర్ఎస్‌ ఖాళీ చేసేస్తోంది. మరి అవి ఏవిధంగా టిఆర్ఎస్‌ను డ్డీకొని ఓడించాలనుకొంటున్నాయి?అంటే ఆ రెండు పార్టీలు రంగంలో దిగితే కానీ తెలీదు. 

సాధారణంగా అధికార పార్టీ ఉపఎన్నికలలో అవలీలగా విజయం సాధిస్తుంటుంది కనుక దాని కంటే ముందే ప్రతిపక్షాలు రంగంలో దిగి దానిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి. కానీ తెలంగాణలో మాత్రం ఏ ఎన్నికలలోనైనా ముందుగా టిఆర్ఎస్‌యే రంగంలో దిగుతుంటుంది. అది అన్ని సర్దేసుకొన్న తరువాత ప్రతిపక్షాలు వచ్చి హడావుడి చేస్తుంటాయి. ఇప్పుడూ అదే జరుగుతోందని అర్ధమవుతోంది. కనుక ఎన్నికల ఫలితం ఏవిధంగా ఉండబోతోందో ఊహించవచ్చు. 


Related Post