ఏపీ సిఎం జగన్‌ ఆకస్మిక డిల్లీ పర్యటన...దేనికో?

September 22, 2020


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ్ళ ఢిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ ఢిల్లీకి బయలుదేరుతారు. సాయంత్రం అమిత్ షాతో భేటీ అవుతారు. తరువాత వీలైతే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రానికి రావలసిన జిఎస్టీ బకాయిల గురించి మాట్లాడుతారు. 

బుదవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకొంటారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. కర్ణాటక ప్రభుత్వం తిరుమల కొండపై ఓ కాటేజీ నిర్మించబోతోంది. దానికి భూమిపూజ చేయడానికి కర్ణాటక సీఎం యడియూరప్ప గురువారం తిరుమల రాబోతున్నారు. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆయనతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం అమరావతికి చేరుకొంటారు. 

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి హటాత్తుగా ఢిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలవబోతుండటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో అంతర్వేది, కనకదుర్గమ్మ మరికొన్ని దేవాలయాలలో వరుసగా జరిగిన ఘటనలతో వైసీపీ-బిజెపి, టిడిపిల మద్య యుద్ధవాతావరణం నెలకొంది. 

రాజధానిని విశాఖకు తరలించాలని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగా ఆరాటపడుతున్నప్పటికీ హైకోర్టు అడ్డుకొంటోంది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం పదేపదే హైకోర్టుకు చెప్పినప్పటికీ రాజధానిని విశాఖకు తరలించకుండా హైకోర్టు అడ్డుకొంటోంది. 

ఈ రెండు సమస్యలు జగన్ ప్రభుత్వానికి ఊపిరి సలపనీయకుండా చేస్తున్నాయి. బహుశః అందుకే ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలువబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్రహోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందిస్తే జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఏపీలో బిజెపి హడావుడి పూర్తిగా తగ్గిపోవచ్చు. రాజధాని తరలింపుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఈయవచ్చు. 


Related Post