కేటీఆర్‌పై సుమేధ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు

September 21, 2020


img

గత గురువారం సాయంత్రం నేరేడ్‌మెట్‌ వద్ద ఓ నాలాలో సుమేధా కపూరియా అనే 12 ఏళ్ళ బాలిక కొట్టుకుపోయి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె తల్లితండ్రులు సోమవారం నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దానిలో మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమీషనర్, జోనల్ కమీషనర్, ఏఈ, డీఈ, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లపై ఫిర్యాదు చేశారు. గత అనేక సంవత్సరాలుగా మేయర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులకు ఈ ఓపెన్ నాలా సమస్య గురించి స్థానికులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, ఆ కారణంగా గతంలో కూడా ఒకటి రెండుసార్లు ఇటువంటి ప్రమాదాలు జరిగాయని పిర్యాదులో పేర్కొన్నారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ మొదలు దిగువస్థాయి అధికారుల వరకు అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వలననే ఎంతో జీవితం, ఉజ్వల భవిష్యత్ ఉన్న తమ కుమార్తె నిండు నూరేళ్ళ జీవితం 12 ఏళ్ళకే ముగిసిపోయిందని, కనుక తమ కుమార్తె మరణానికి పైన పేర్కొన్న అందరినీ బాధ్యులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుమేధ తల్లితండ్రులు లిఖియతపూర్వకంగా నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి పిర్యాదును స్వీకరించారు. 



 అయితే వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మంత్రి కేటీఆర్‌, మేయర్, జీహెచ్‌ఎంసీ కమీషనర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులపై చర్యలు తీసుకొంటారని ఆశించడం అత్యాశే అవుతుంది. పైగా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు సుమేధ తల్లితండ్రులే అనూహ్యమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ మంత్రి కేటీఆర్‌ వారి ఆవేదనను అర్ధం చేసుకొని వారిని కలిసి మాట్లాడి సమస్యను సులువుగా పరిష్కరించుకొనే అవకాశం కూడా ఉంది. మరి కేటీఆర్‌ ఈ పిర్యాదుపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 


Related Post