భారత్‌లో తొమ్మిది మంది ఉగ్రవాదులు అరెస్ట్

September 19, 2020


img

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి తీసుకొంటున్న పలు చర్యల వలన అడపాదడపా ఒక్క కశ్మీర్‌లో తప్ప దేశంలో మిగిలిన ప్రాంతాలలో ఉగ్రదాడులు నిలిచిపోయాయి. కానీ దేశంలో ఉగ్రవాదులు లేదా వారి సానుభూతిపరులు మాత్రం ఎప్పుడు అవకాశం చిక్కినా జనసమర్ధం ఉన్న ప్రాంతాలపై దాడులు చేసేందుకు సిద్దంగానే ఉన్నారని తెలిస్తే సామాన్య ప్రజలు ఉలిక్కిపడక మానరు. 

జాతీయ దర్యాప్తు బృందం కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురిని, పశ్చిమ బెంగాల్లో ముర్షీదాబాద్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి ఇళ్ళలో నుంచి బాంబులు తయారుచేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ప్రేలుడు పదార్ధాలు, విస్ఫోటనం చేయడానికి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, నాటు తుపాకీలు, అల్-ఖైదాకు చెందిన జిహాదీ సాహిత్యం, కొన్ని ముఖ్యమైన పత్రాలు వగైరాలను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. వారు పాకిస్థాన్‌ కేంద్రంగా నడుస్తున్న అల్-ఖైదా సూచనల మేరకు దేశంలో భారీ ఎత్తున ప్రేలుళ్ళకు సన్నాహాలు చేస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు చెప్పారు. ఉగ్రవాదంవైపు ఆకర్షించబడిన వారందరూ సామాజిక మాద్యమాల ద్వారా మరికొంతమందిని ఆకర్షించి దేశవ్యాప్తంగా దాడులు జరిపేందుకు కుట్ర పన్నుతున్నారని తెలిపారు. వారిలో కొందరు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళ్ళేందుకు సిద్దమయినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. అరెస్ట్ చేసిన ఉగ్రవాదులందరినీ సంబంధిత కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత కోర్టు అనుమతితో వారిని కస్టడీలో తీసుకొని మరింత లోతుగా విచారణ జరుపుతామని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు చెప్పారు.


Related Post