కాంగ్రెస్‌ నేతల వ్యూహం బెడిసి కొట్టిందా?

September 18, 2020


img

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ విషయంలో శాసనసభలో టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి సవాలు విసిరి ఇబ్బంది పెడదామనుకొన్న కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు పంచిపెట్టి ఎన్నికలలో లబ్ది పొందాలని టిఆర్ఎస్‌ భావిస్తుంటే, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టకుండా టిఆర్ఎస్‌ ప్రభుత్వం నగరంలో పేదప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ టిఆర్ఎస్‌ వ్యతిరేక ఓటును పొందాలనుకొన్నారు కాంగ్రెస్‌ నేతలు. 

లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను చూపించమని భట్టి విక్రమార్క శాసనసభలో విసిరిన సవాలును టిఆర్ఎస్‌ ప్రభుత్వం స్వీకరించడంతో కాంగ్రెస్‌ నేతలు కంగుతిన్నారు. కానీ వెనక్కు తగ్గితే టిఆర్ఎస్‌ది పైచేయి అవుతుందనే ఆలోచనతోనో లేదా అన్ని ఇళ్ళు పూర్తయి ఉండవనే నమ్మకంతోనో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు వాటి పరిశీలనకు బయలుదేరారు. కానీ వేల సంఖ్యలో పూర్తయిన ఇళ్ళు వరుసగా కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌ నేతలు మళ్ళీ కంగుతిన్నారు. అందుకే జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ళు చూపమంటే నగర శివార్లలో ఇతర నియోజకవర్గాలలో కట్టిన ఇళ్ళను చూపిస్తున్నారంటూ ఆరోపించి అర్ధాంతరంగా తమ పర్యటనను రద్దు చేసుకొన్నట్లున్నారు. 

ఒకవేళ కాంగ్రెస్‌ నేతలందరూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనుక వెళ్ళి మొత్తం లక్ష ఇళ్ళను చూస్తూంటే ఆ విషయం ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలతో సహా మీడియాలో వార్తలుగా వచ్చేస్తాయని వేరే చెప్పక్కరలేదు. ఒకవేళ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ గురించి టిఆర్ఎస్‌ను ప్రశ్నిస్తే, లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు కాంగ్రెస్‌ నేతలే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ ఇప్పుడు వారు ఆ ఇళ్ళలో పర్యటిస్తుండగా మీడియా తీసిన ఆ ఫోటోలు, వీడియోలనే ప్రజలకు చూపించి గట్టిగా సమాధానం ఇవ్వగలదు. 

టిఆర్ఎస్‌ ఉచ్చులో చిక్కుకొని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పరిశీలనకు బయలుదేరామని కొమ్ములు తిరిగిన కాంగ్రెస్‌ నేతలు కాస్త ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. అందుకే అర్ధాంతరంగా పర్యటనను విరమించుకొని లక్ష ఇళ్ళు చూపించాలంటూ మళ్ళీ టిఆర్ఎస్‌కు సవాలు విసరడం ప్రారంభించారు. కానీ ఇప్పటికే తప్పటడుగు వేసినందున ఇక ఈ అంశంపై కాంగ్రెస్‌ నేతలు ఎన్ని విమర్శలు చేసినా టిఆర్ఎస్‌కు నష్టం ఉండదు.


Related Post