కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ నేతలు కలిసి పర్యటన!

September 18, 2020


img

రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ నేతలు నిత్యం పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ నిన్న అందుకు భిన్నంగా వారందరూ కలిసి హైదరాబాద్‌ నగరంలో నిర్మించబడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను సందర్శించారు. 

ఈ అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మొన్న శాసనసభలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, హైదరాబాద్‌లో లక్ష ఇళ్ళు ఎక్కడ నిర్మించారో చూపగలరా? అంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ సవాలును స్వీకరిస్తున్నానని చెప్పి, తానే స్వయంగా కాంగ్రెస్‌ నేతలను తీసుకువెళ్ళి ఆ ఇళ్లను చూపిస్తానని ప్రకటించారు. 

చెప్పినట్లుగానే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, భట్టి విక్రమార్క ఇంటికి వెళ్ళి ఆయనను తన కారులో ఎక్కించుకొని జియాగూడలోని సంజయ్‌నగర్‌ బల్దియాకాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను, ఆ తరువాత అక్కడి నుంచి వరుసగా బన్సీలాల్‌ పేటలోని గంగి ఎల్లయ్య దొడ్డి, పొట్టి శ్రీరాములు నగర్‌, చాచా నెహ్రూనగర్‌, బండ మైసమ్మనగర్‌, మారేడ్‌పల్లిలో నిర్మిస్తున్న ఇళ్ళవద్దకు తీసుకువెళ్ళి చూపించారు. ఈ పర్యటనలో సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావుతో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా పాల్గొన్నారు. టిఆర్ఎస్‌ తరపున మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే వివేకానందలు వారికి దగ్గరుండి ఇళ్ళు చూపించారు. 

మొదటిరోజున మొత్తం 3,428 ఇళ్ళను చూశామని, మిగిలిన ఇళ్ళను కూడా చూసేందుకు తాము సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్‌ నేతలన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వారికి లక్ష ఇళ్ళు చూపిస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకూ తాను నగరం విడిచి ఎక్కడకూ వెళ్ళనని, మంత్రి తలసాని మాట తప్పకుండా లక్ష ఇళ్ళు చూపించాలని భట్టి విక్రమార్క అన్నారు. 

టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను సకాలంలో పూర్తి చేయకుండా తాత్సారం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు వాటిని లబ్దిదారులకు పంచిపెట్టి వారి ఓట్లు దండుకోవాలని యోచిస్తోందని ఆరోపించారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడం వలననే ఆరున్నరేళ్లు గడిచినా ఇంకా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ హామీని అమలుచేయలేదు,” అని భట్టి విక్రమార్క విమర్శించారు. 


Related Post