టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూల్చివేత

September 18, 2020


img

వరంగల్‌ నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమకట్టడాల కారణంగా ఇటీవల నగరంలో పలుప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు వరంగల్‌ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. వాటిలో టిఆర్ఎస్‌ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ క్యాంప్ కార్యాలయం కూడా ఉంది. నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గవద్దని మంత్రి కేటీఆర్‌ మునిసిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వారు నాలాలపై అక్రమంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో సహా పలు ఇళ్ళను జేసీబీతో కూల్చివేశారు. మురుగునీరు పారేందుకు తన క్యాంప్ కార్యాలయం అవరోదంగా ఉందని మునిసిపల్ అధికారులు భావిస్తే దానిని తొలగించవచ్చని తానే దానిని స్వచ్ఛందంగా వారికి అప్పగిస్తానని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెప్పారు. 

వరంగల్‌ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల సమక్షంలో మున్సిపల్ సిబ్బంది బుదవారం ఉదయం నుంచి భద్రకాళి, ములుగు రోడ్డు, నయీంనగర్ ప్రాంతాలలో నాలాలపై ఉన్న 22 అక్రమకట్టడాలను కూల్చివేశారు. ఇప్పటివరకు మొత్తం 88 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. 

ప్రజలకు ఆదర్శంగా నిలువవలసిన ప్రజాప్రతినిధులే నాలాలపై అక్రమకట్టడాలు నిర్మించుకోవడాన్ని ఎవరూ హర్షించలేరు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలను ధిక్కరించే సాహసం చేయలేక ఎమ్మెల్యే రమేష్ తన క్యాంప్ కార్యాలయం కూల్చివేసేందుకు అంగీకరించారే తప్ప మునిసిపల్ అధికారులు అడిగితే ఒప్పుకొంటారా? మంత్రి కేటీఆర్‌ వచ్చి పరిస్థితిని కళ్ళారా చూసి గట్టిగా హెచ్చరిస్తే కానీ నాలాలపై అక్రమనిర్మాణాలు కూల్చాలనే ఆలోచన మునిసిపల్ అధికారులకు కలగకపోవడాన్ని ఏమనుకోవాలి? అసలు నాలాలపై అక్రమకట్టడాలు వెలుస్తున్నాయని తెలిసినా మునిసిపల్ అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఏమనుకోవాలి? వారి అలసత్వానికి ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవడమే కాక నగరం నీట మునిగి ప్రజలు కూడా చాలా ఇబ్బందిపడవలసి వచ్చింది కదా?   


Related Post