పాతబస్తీని ఇంకా ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? ఓవైసీ ప్రశ్న

September 17, 2020


img

గురువారం జరిగిన శాసనసభ సమావేశంలో మజ్లీస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ పనితీరును ఓవైపు పొగుడుతూనే, పాతబస్తీలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తోందని కానీ పాతబస్తీని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాతబస్తీలో రోడ్లు వెడల్పు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం దృష్టి ఎప్పుడూ హైటెక్ సిటీ, గచ్చిబౌలి వైపే ఉంటోందని తప్ప పాతబస్తీవైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి ప్రాంతాలను ఏవిధంగా అభివృద్ధి చేశారో పాతబస్తీని కూడా అదేవిధంగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నగరంలో మెట్రో సేవలు ప్రారంభమై నాలుగేళ్ళు గడుస్తున్నా పాతబస్తీ మీదుగా మెట్రో లైన్ వేయడానికి ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి మేము ఏమైనా సూచిస్తే సవాలక్ష సాకులు చెపుతుంటుందని కానీ ప్రభుత్వం తలుచుకొంటే ఆఘమేఘాలపై పనులు పూర్తిచేయిస్తుందని విమర్శించారు. ఇకనైనా పాతబస్తీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని గట్టిగా చెప్పారు.

హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళలో వింతతువులు, ఒంటరి మహిళలు, అంగవైకల్యం, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే జనాభా ప్రాతిపదికన ముస్లింలకు ఇళ్ళు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో తమ పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తోందని, అదేవిధంగా ప్రభుత్వం కూడా పాతబస్తీ అభివృద్ధి చేసి, అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుకొంటున్నామని అన్నారు.

నగరంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న బస్తీదవాఖనాలు పేదప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అటువంటి మంచి పనులు చేస్తే ప్రజలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో తప్పకుండా మళ్ళీ టిఆర్ఎస్‌కే పట్టం కడతారని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.

అక్బరుద్దీన్ ఓవైసీ పాతబస్తీ సమస్యల గురించి శాసనసభలో చాలా గట్టిగానే మాట్లాడారు. అయితే ఆయన ప్రభుత్వంపై ఎంత ఘాటు విమర్శలు గుప్పించినప్పటికీ, టిఆర్ఎస్‌ పాతబస్తీలో పోటీ చేయదు కనుక వాటివలన దానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అదీగాక అక్బరుద్దీన్ ఓవైసీ కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పాతబస్తీ గురించి గట్టిగా మాట్లాడుతున్నారని టిఆర్ఎస్‌కు కూడా తెలుసు. అందుకే ఆయన విమర్శలపై టిఆర్ఎస్ పెద్దగా స్పందించలేదని చెప్పవచ్చు.

ఒకవేళ జీహెచ్‌ఎంసీ నిజంగానే పాతబస్తీలో ఆక్రమణలు తొలగించి రోడ్లు వెడల్పు చేయడానికి సిద్దపడితే, అప్పుడు ముందుగా అడ్డుపడేది మజ్లీస్ నేతలే అని అందరికీ తెలుసు. పాతబస్తీ అభివృద్ధి కాకపోవడానికి మజ్లీస్ ద్వందవైఖరే కారణమని చెప్పవచ్చు. పాతబస్తీ మీదుగా మెట్రో లైన్ ఎందుకు వేయలేదని శాసనసభలో నిలదీస్తున్న మజ్లీస్ పార్టీయే దాని నిర్మాణానికి అడ్డుపడిందని అందరికీ తెలుసు. పాతబస్తీలో అనేక చారిత్రిక, మత ప్రాధాన్యమైన కట్టడాలున్నాయని కనుక మెట్రో కారిడార్‌ డిజైన్లో మార్పు చేయాలని చెపుతూ ఆనాడు అడ్డుపడింది మజ్లీస్ పార్టీయే. నగరంలో మిగిలిన ప్రాంతాలలో కూడా అనేక సమస్యలు ఎదురైనప్పటికీ ప్రభుత్వం వాటన్నిటినీ అధిగమించి మెట్రో లైన్ ఏర్పాటు చేయించింది. కానీ మజ్లీస్ పార్టీ సహకరిస్తే తప్ప పాతబస్తీ మీదుగా మెట్రో లైన్ నిర్మాణం కష్టమే. ఈసంగతి మజ్లీస్, టిఆర్ఎస్‌ నేతలందరికీ తెలుసు.      



Related Post