బెజవాడ కనకదుర్గమ్మ సింహాలనే ఎత్తుకుపోయారు!

September 16, 2020


img

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మళ్ళీ కలకలం మొదలైంది. అమ్మవారిని ఊరేగించే వెండిరధంకు నాలుగు వైపులా వెండిరేకు తాపటం చేయబడిన నాలుగు సింహం బొమ్మలలో మూడు మాయం అయిపోయాయి. ఈవిషయం సోమవారం బయటపడింది.

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆరు అంతస్తుల రధం ఇటీవల అగ్నికి ఆహుతి అయిపోవడంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో రధాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దాంతో విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బి శ్రీనివాసులు సోమవారం కనకదుర్గమ్మ ఆలయంలో పర్యటించి అమ్మవారి రధాలను పరిశీలిస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది.

ఏటా ఉగాదినాడు శ్రీదుర్గామల్లేశ్వరులను ఆ రధంలో ఊరేగిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించలేదు. కనుక గత ఏడాది ఉగాది తరువాత నుంచి ఆ రధానికి పరదాలు కట్టి ఉంచేశారు. దానిని మొన్న పరిశీలించినప్పుడు వాటిలో మూడు సింహం బొమ్మలు మాయం అయినట్లు పోలీస్ కమీషనర్ గుర్తించేవరకు ఆలయ ఈవోకు కూడా తెలీకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆలయ ప్రాంగణంలో నిలిపి ఉంచిన ఆ రథంపై బిగించబడిన మూడు సింహాలు ఎప్పుడు ఎవరు దొంగతనం చేశారు? అని తెలుసుకోవాలంటే సిసి కెమెరా రికార్డింగులు చాలా ముఖ్యం. కానీ దుర్గమ్మ గుడిలో బిగించిన సిసి కెమెరాలలో గత 15 రోజుల రికార్డింగ్ మాత్రమే భద్రపరిచేవిధంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. దాంతో ఎప్పటికప్పుడు 15 రోజుల క్రితం నమోదైన వివరాలు చెరిగిపోతుంటాయి. కనుక ఆలయంలో సీసీ కెమేరాలున్నా కూడా ప్రయోజనం లేదు.

లాక్‌డౌన్‌ సమయంలో దుర్గమ్మ గుడిని మూసివేసినప్పుడు ఎవరో సింహం బొమ్మలను దొంగిలించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆలయ సిబ్బంది తప్ప బయటివారెవరూ పెద్దగా కొండపైకి రాలేదు. కనుక ఇది బహుశః ఇంటిదొంగల పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఆలయాలలో వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలపై టిడిపి, బిజెపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేది ఘటన గురించి ఫిర్యాదు చేయడానికి ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ్ళ  ఏపీ గవర్నర్‌ను కలువబోతున్నారు. ఇప్పుడు ఈ ఘటన కూడా జరుగడంతో ఆయన ఇవాళ్ళ ఉదయం కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అమ్మవారి రధంపై సింహం బొమ్మలు మాయం అవడంపై ఆలయ ఈవోను గట్టిగా నిలదీశారు. అయితే సింహం బొమ్మలు ఏవిధంగా మాయం అయ్యాయో చెప్పడానికి మూడు రోజులు సమయం కావాలని ఈవో చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అంతర్వేది స్వామివారి రధం దగ్దం ఘటనపై ఇప్పటికే అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షాలైన టిడిపి, బిజెపిలకు మద్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుకొంది. సరిగ్గా ఈ సమయంలోనే మళ్ళీ ఈ ఘటన జరుగడంతో జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. కనిపించే మూడు సింహాలు మాయం అయ్యాయి కనుక కనబడని ఆ నాలుగో సింహంగా చెప్పుకోబడే పోలీసులు ఇప్పుడు ఏమి చేస్తారో చూడాలి. 


Related Post