ఏపీ, టీఎస్‌ఆర్టీసీ ప్రతిష్టంభన యధాతధం

September 15, 2020


img

ఏపీ, తెలంగాణల మద్య అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు నడిపే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఇవాళ్ళ మళ్ళీ ఇరు రాష్ట్రాల  ఆర్టీసీ ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో సమావేశమయ్యి చర్చించారు. కానీ ఒకరి ప్రతిపాదనలకు మరొకరు అంగీకరించకపోవడంతో సమావేశం ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసింది. దాంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, “రూట్లవారీగా సమానకిలోమీటర్లు నడపాలని మేము కోరుతున్నాము. కానీ ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అందుకు అంగీకరించడం లేదు. వారు ఈవిషయమై లిఖితపూర్వకంగా స్పష్టత ఇచ్చిన తరువాతే బస్సులను నడిపిస్తాము,” అని అన్నారు. 

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ, “ఏపీలో 50,000 కిమీ సర్వీసులు పెంచుకోమని, అందుకు బదులుగా మేము తెలంగాణలో ఆమేరకు సర్వీసులు తగ్గించుకొంటామని చెపుతున్నాము. కానీ ఇదివరకున్న సర్వీసులకు మించి ఇంకా పెంచడం తమకు లాభదాయకం కాదని టీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీకి తెలంగాణకు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులు నడిపేందుకు పర్మిట్ ఉంది. వాటిపై కూడా టీఎస్‌ఆర్టీసీ షరతులు విదిస్తోంది. ఇది మాకు సమ్మతం కాదు. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు కనుక తుది నిర్ణయం తీసుకొనేవరకు రోజుకు చెరో 250 బస్సులు నడుపుకొందామని చెప్పాము. కానీ దానికీ టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. ఆర్టీసీ బస్సులు నడిపించకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ లాభపడతాయని చెప్పాము. మళ్ళీ రెండు రోజులలో మరోసారి సమావేశమయ్యి ఈ సంస్యలపై చర్చిస్తాం. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాము,” అని చెప్పారు. 


Related Post