దుబ్బాకలో కాంగ్రెస్‌, బిజెపిలు చేతులు కలుపనున్నాయా?

September 15, 2020


img

బీహార్ శాసనసభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 64 శాసనసభ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి అక్టోబర్-నవంబర్‌ మద్యలో ఎన్నికలు జరిపిస్తామని కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించడంతో రాష్ట్రంలో కూడా మళ్ళీ ఎన్నికల వేడి రాజుకోంటోంది. సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన ఆ స్థానం నుంచి ఆయన భార్యను పోటీ చేయించాలని టిఆర్ఎస్‌ భావిస్తున్నట్లు సమాచారం. 

అయితే టిఆర్ఎస్‌లోని ఓ వర్గం ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. రామలింగారెడ్డి ఏనాడూ తమను పట్టించుకోలేదని కనుక మళ్ళీ ఆయన కుటుంబానికే టికెట్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెపుతున్నారు. 2018 శాసనసభ ఎన్నికలలోనే దుబ్బాక నుంచి పోటీచేయాలని ఆశపడి భంగపడిన వెంకట నరసింహారెడ్డి కూడా పార్టీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇటువంటి అసంతృప్తులు పార్టీకి చాలా నష్టం కలిగించే ప్రమాదం ఉంది కనుక వారికి నచ్చజెప్పే బాధ్యతను సిఎం కేసీఆర్‌ కొందరు ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది. 

లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకొన్న బిజెపి ఈ ఉపఎన్నికలలో కూడా విజయం సాధించి మళ్ళీ సత్తా చాటుకోవాలని తహతహలాడుతోంది. టిఆర్ఎస్‌లో అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకోవడం ద్వారా టిఆర్ఎస్‌ను దెబ్బతీయాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. 

అయితే ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి లక్షకు పైగా మెజార్టీతో విజయం సాధించబోతున్నారంటూ సిఎం కేసీఆర్‌ ప్రకటించడంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌, బిజెపిలు ఒకవేళ తమ అభ్యర్ధులను గెలిపించుకొనే పరిస్థితి లేదని భావిస్తే టిఆర్ఎస్‌ అభ్యర్ధిని ఓడించేందుకు అవసరమైతే పరస్పరం సహకరించుకోవడానికి కూడా వెనుకాడకపోవచ్చు. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలు ఆవిధంగా పరస్పరం సహకరించుకొని సిట్టింగ్ ఎంపీ, సిఎం కేసీఆర్‌ కుమార్తె కవితను ఓడించిన సంగతి తెలిసిందే. కనుక కాంగ్రెస్‌, బిజెపిలు వేర్వేరుగా పోటీ పడుతుంటే పరువాలేదు కానీ రెండూ తెరవెనుక చేతులు కలిపితే ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఎదురీత తప్పకపోవచ్చు.


Related Post