ఎంతసేపు సొంతడబ్బా వాయించుడేనా: సీతక్క ప్రశ్న

September 15, 2020


img

ఈ నెల 10వ తేదీన రంగారెడ్డి జిల్లా కడ్తల్‌కు చెందిన నాగులు అనే వ్యక్తి రవీంద్రభారతి వద్ద ఒంటికి నిప్పంటించుకొని 60 శాతం కాలినగాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న నాగులు ఆర్ధికబాధలతో సతమతమవుతూ ‘తెలంగాణ వచ్చినా న్యాయం జరుగలేదు...ఇంకా ఎదురుచూసే ఓపిక లేదు. కేసీఆర్‌ సార్...జై తెలంగాణ...’ అంటూ నినాదం చేస్తూ ఆత్మహుతికి పాల్పడ్డాడు. 

అసెంబ్లీకి కూతవేటుదూరంలో ఓ ఉద్యమకారుడు ఒంటికి నిప్పంటించుకొని చనిపోతే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తప్ప టిఆర్ఎస్‌లో ఎవరూ స్పందించలేదు. ఈ ఘటనపై ములుగు ఎమ్మెల్యే సీతక్క శాసనసభలో నిన్న జీరో అవర్‌లో టిఆర్ఎస్‌ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“నాగులు తన ఇంటిపేరును తెలంగాణ అని గర్వంగా చెప్పుకొంటుంటాడు. అతని ఒంటిపై టిఆర్ఎస్‌ జెండాను పచ్చబొట్టు పొడిపించుకొన్నాడు. అటువంటి ఉద్యమకారుడు అసెంబ్లీకి సమీపంలో ఆత్మహుతి చేసుకొని చనిపోతే ప్రభుత్వం కనీసం స్పందించదా? ఆసుపత్రిలో ఉన్న అతనిని పరామర్శించేందుకు ఎవరికీ తీరిక లేదా? నివాళులు అర్పించలేదా? ఉద్యమకారులను గౌరవించడం నేర్చుకోండి. అసలు వాళ్ళు ఏమి చెపుతున్నారో ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? శాసనసభలో ఎంతసేపు ప్రభుత్వం సొంత డబ్బా వాయించుకోవడం తప్ప ప్రజాసమస్యల గురించి మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు ఇస్తున్నారా?కనీసం ఇప్పటికైనా తెలంగాణ నాగులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సభ ద్వారా హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ వలన సామాన్యప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నాను,” అని సీతక్క ఆవేశంగా మాట్లాడారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ సీతక్క చెప్పిన విషయాలపై ప్రభుత్వం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొంటుందని హామీ ఇచ్చారు. 


Related Post