హైదరాబాద్‌ మెట్రో పరిస్థితి ఏమిటో?

September 14, 2020


img

ప్రపంచమంతా కరోనాకు ముందు కరోనాకు తరువాత అన్నట్లు తయారైనందున ప్రతీరంగంపై కరోనా ప్రభావం స్పష్టం కానిపిస్తోంది. దానికి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కూడా అతీతం కాదు కనుక మూడున్నరేళ్లు క్షణం విరామం లేకుండా తిరిగిన మెట్రో రైళ్లు ఆరు నెలలపాటు డిపోలకే పరిమితమయ్యాయి. ఎట్టకేలకు ఈనెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు తిరగడం ప్రారంభించాయి. కానీ మెట్రో రైళ్ళలో కూడా భౌతికదూరం పాటించవలసి వస్తుండటంతో 50 శాతం ప్రయాణికులతోనే మెట్రో రైళ్లు నడిపించవలసివస్తోంది. అదీగాక కరోనా కారణంగా హైదరాబాద్‌లో చాలా ఐ‌టి కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ళవద్ద నుంచే పనిచేసుకోవడానికి అనుమతించడంతో అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ కారిడార్‌లో ప్రయాణించేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కరోనా భయంతో కూడా ప్రజలు మెట్రో రైళ్ళలో ప్రయాణించేందుకు వెనకాడుతున్నారు. 

ఒకప్పుడు అంటే కరోనాకు ముందు రోజుకు సుమారు 4.5 లక్షల మంది మెట్రో రైళ్ళలో ప్రయాణించేవారు  కానీ ఇప్పుడు మూడు కారిడార్‌లలో కలిపి రోజుకు 30-40,000 మందికి మించి ప్రయాణించడం లేదు. ఇది మెట్రో నిర్వహణ వ్యయానికి కూడా సరిపోదు. రోజుకు కనీసం 1.5-2 లక్షల మంది ప్రయాణిస్తేనే బొటాబోటీగా సరిపోతుంది. ఇంతకాలం మెట్రో రైళ్ళు నడిపించలేకపోవడం వలన హైదరాబాద్‌ మెట్రో నష్టపోతే, ఇప్పుడు తగినంత మంది  ప్రయాణికులు లేకుండా నడిపించవలసి వస్తున్నందుకు నష్టం భరించవలసివస్తోంది. అయితే మెట్రో స్టేషన్లు, మెట్రో రైళ్ళలో కరోనా వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నందున క్రమంగా హైదరాబాద్‌ వాసులు మళ్ళీ మెట్రో రైల్ ప్రయాణాలకే మొగ్గు చూపుతారని మెట్రో అధికారులు ఆశిస్తున్నారు. 


Related Post