సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తా: సిఎం కేసీఆర్

September 14, 2020


img

సింగరేణి కార్మిక సంఘాలకు అక్టోబర్ 2017లో ఎన్నికలు జరిగినప్పుడు టిఆర్ఎస్‌కు అనుబంద తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టిబిజికెఎస్) గౌరవాధ్యక్షురాలి హోదాలో సిఎం కేసీఆర్‌ కుమార్తె, అప్పటి ఎంపీ కవిత సింగరేణిలో తిరిగి ఉదృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో టిబిజికెఎస్‌ను గెలిపిస్తే, కారుణ్య నియమాకాలు జరిపిస్తామని, బొగ్గుగని కార్మికులందరి ఇళ్ళలో ఏసీలు పెట్టిస్తానని, ఒక్కో కార్మికుడు సొంత ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇప్పిస్తానంటూ అనేకానేక హామీలు గుప్పించారు. ఆమె సాక్షాత్ ముఖ్యమంత్రి కుమార్తె కావడంతో సింగరేణి కార్మికులు ఆమె హామీలను నమ్మి ఎన్నికలలో టిబిజికెస్‌ను గెలిపించారు.

సరిగ్గా మూడేళ్ళ తరువాత మళ్ళీ ఇవాళ్ళ శాసనసభలో కారుణ్యనియామకాలు చేపడతామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అంటే నేటికీ ఆ హామీని అమలుచేయలేకపోయామని సిఎం కేసీఆర్‌ స్వయంగా దృవీకరించినట్లయింది. ఎన్నికల సమయంలో కారుణ్యనియామకాల హామీ ఇస్తున్నప్పుడు కవితమ్మ ఆ ఉద్యోగాలు పొందేందుకు ఎటువంటి షరతుల గురించి చెప్పలేదు. కానీ ఇప్పుడు సిఎం కేసీఆర్‌ చల్లగా చెప్పారు. కారుణ్య నియామకాలకు అర్హతకలిగిన వారందరికీ తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తాం. కానీ వారి విద్యార్హతలకు తగిన ఖాళీలు ఏర్పడే వరకు జనరల్ మజ్దూర్‌గా మాత్రమే తీసుకొంటాం. ఖాళీలు ఏర్పడినప్పుడు వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రమోట్ చేసి పోస్టులో తీసుకొంటాం. వారి కోసం ప్రత్యేకంగా పోస్టులు సృష్టించి ఉద్యోగాలు కల్పించలేము,” అని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

సింగరేణి కార్మికుల సమస్యలన్నీ తనకు క్షుణ్ణంగా తెలుసునని త్వరలోనే వారి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని సిఎం కేసీఆర్‌ సభాముఖంగా నేడు హామీ ఇచ్చారు. మూడేళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వం తరపున టిబిజికెఎస్ ఇచ్చిన హామీలనే ఇంతవరకు అమలుచేయలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తుండటం విడ్డూరంగా ఉంది. ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేస్తే మసిబారిన సింగరేణి కార్మికుల జీవితాలలో మళ్ళీ వెలుగులు నిండుతాయి కదా?


Related Post