అందుకు ఏపీ ఒప్పుకొంటేనే బస్సులు నడిపిస్తాం: పువ్వాడ

September 12, 2020


img

ఇవాళ్ళ ఏపీ, తెలంగాణ రవాణాశాఖల మంత్రులు పేర్నీ నాని, పువ్వాడ విజయ్ కుమార్ ఇవాళ్ళ హైదరాబాద్‌లో భేటీ అయ్యి అంతర్ రాష్ట్ర సర్వీసుల గురించి చర్చించవలసి ఉంది. కానీ కిలోమీటర్ల విధానంలో బస్సులు నడిపించేందుకు అధికారుల మద్య అంగీకారం కుదిరిన తరువాతే ఏపీ రవాణామంత్రితో భేటీ అవుతానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పడం గమనిస్తే రెండు రాష్ట్రాల మద్య ప్రతిష్టంభన కొనసాగుతోందని స్పష్టమవుతోంది. దీనిపై  ఇరురాష్ట్రాల రవాణాశాఖ, ఆర్టీసీ అధికారుల మద్య సమావేశాలు కొనసాగుతుంటాయని చెప్పడం గమనిస్తే ఇప్పట్లో ఈ సమస్య ఇప్పట్లో తేలేదికాదని మంత్రి పువ్వాడ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. 

రెండు నెలల క్రితం కేంద్రప్రభుత్వం అంతర్ రాష్ట్ర సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల మద్య ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యి చర్చించారు. అయితే ఇక నుంచి ఏపీలో టీఎస్‌ఆర్టీసీ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్నే కిలోమీటర్లు తిప్పాలని అంతకు మించి తిప్పరాదని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కావాలంటే ఏపీలో తమ సర్వీసులను మరింత తగ్గించుకోవడానికి కూడా సంసిద్దత వ్యక్తం చేసింది. 

అయితే తెలంగాణలో ఏపీకి చెందిన ప్రజలు లక్షల్లో ఉన్నారు కనుక తెలంగాణ సర్వీసులు తగ్గించుకొంటే ఏపీఎస్ ఆర్టీసీ నష్టపోతుంది కనుక ఆ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు. కానీ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తెలంగాణలో ఎక్కువ తిరుగుతుంటే ఆ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఆదాయం కోల్పోతుంది కనుక ఈ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గదలచుకోలేదు. దాంతో రెండు రాష్ట్రాల మద్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. కనుక ఏపీ, తెలంగాణల మద్య ఆర్టీసీ బస్సులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలీని పరిస్థితి నెలకొంది. పంతాలకి పోయి ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిప్పకపోవడంతో లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు సందట్లో సడేమియా అన్నట్లు హాయిగా బస్సులు తిప్పుకొని నష్టాలు పూడ్చుకొంటున్నాయి. 


Related Post