రాష్ట్రంలో జోరుగా పాలాభిషేకాలు

September 12, 2020


img

కొత్త రెవెన్యూ చట్టానికి శాసనసభ ఆమోదం తెలుపడంతో రాష్ట్రవ్యాప్తంగా సిఎం కేసీఆర్‌ చిత్రపటాలకి టిఆర్ఎస్‌ కార్యకర్తలు, వివిద వర్గాల ప్రజలు పాలాభిషేకాలు చేస్తున్నారు. వారిలో కొందరు అవినీతిమయమైన వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకాలు చేస్తుంటే, అవినీతిపరులుగా ముద్రవేసిన తమకు వేరే శాఖలలో స్కేల్ ఉద్యోగులుగా బదిలీలు చేస్తానని సిఎం కేసీఆర్‌ ప్రకటించినందుకు సంతోషంతో పాలాభిషేకాలు చేస్తుండటం విశేషం. 

అయితే కొత్త రెవెన్యూ చట్టానికి నిన్ననే శాసనసభలో ఆమోదముద్ర వేసినందున దాని గురించి ఇంకా ఎమ్మెల్యేలకే పూర్తిగా అవగాహన ఏర్పడి ఉండకపోవచ్చు. ఇక గ్రామాలలో సిఎం కేసీఆర్‌ చిత్రపతాలకు పాలాభిషేకాలు చేస్తున్న రైతులు, సామాన్య ప్రజలకు ఆ కొత్త చట్టంలో ఏముందో...అది అమలులోకి వస్తే రెవెన్యూ వ్యవస్థలో ఎటువంటి మార్పులు జరుగుతాయో? దాంతో తమ కష్టాలన్నీ మంత్రదండంతో మాయం చేసినట్లు మాయమైపోతాయా లేదా?అని ఎలా తెలుస్తుంది?

అయినా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కొత్త రెవెన్యూ చట్టానికి స్వాగతిస్తూ దానిని రూపొందించిన సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటూ టిఆర్ఎస్‌ కార్యకర్తలు, బహుశః వారి ప్రోత్సాహంతో గ్రామస్తులు పాలాభిషేకాలు చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదివరకు రాష్ట్రంలో సమగ్రభూసర్వే చేయించి, రెవెన్యూ రికార్డులన్నీ ప్రక్షాళన చేస్తే అందరి కష్టాలు తీరిపోతాయని టిఆర్ఎస్‌ నేతలు బల్లగుద్ది వాదించారు. కానీ ఆ తరువాత నుంచి నేటికీ కూడా లక్షలాదిమంది రైతులు పట్టదార్ పాసుపుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారిలో కొంతమంది తీవ్ర నిరాశానిస్పృహలతో  ఆత్మహత్యలు చేసుకోవడం అందరికీ తెలుసు. ఒకప్పుడు రెవెన్యూ ఉద్యోగులను పొగిడిన ప్రభుత్వమే అది పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని అందుకే కొత్త చట్టం చేసి మళ్ళీ సమగ్ర భూసర్వే చేయిస్తామని చెపుతుండటం విశేషం. 

భ్రష్టు పట్టిపోయిన ఓ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రజలకు సాయపడాలనుకోవడం చాలా మంచి ఆలోచనే. ఇటువంటి ప్రయత్నం చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించవలసిందే. కానీ కొత్త రెవెన్యూ చట్టం లోటుపాట్ల గురించి ఏమీ తెలియక మునుపే... రాష్ట్రంలో అది ఇంకా అమలులోకి రాకమునుపే అదొక మహాద్భుతం... దాంతో రైతులు, ప్రజల కష్టాలన్నీ మంత్రదండంతో మాయం చేసినట్లు మాయమైపోతాయన్నట్లు టిఆర్ఎస్‌ కార్యకర్తలు హడావుడి చేస్తుండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ తరువాత దానిలో ఏదైనా లోపాలు బయటపడితే అప్పుడు టిఆర్ఎస్సే నవ్వులపాలవుతుందని గ్రహిస్తే ఈవిధంగా చేయరు. టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తల ప్రోద్బలం లేకుండా రాష్ట్రంలో రైతులు, సామాన్య ప్రజలే సిఎం కేసీఆర్‌ చిత్రపటాలకి పాలాభిషేకాలు చేస్తున్నారనుకోలేము. ఒకవేళ నిజంగా చేస్తుంటే అది చాలా గొప్ప విషయమే అవుతుంది.

అసలు ఈ పాలాభిషేకాల హడావుడి ఎందుకు మొదలైంది? అంటే రెవెన్యూ వ్యవస్థపై అవినీతి ముద్రవేసి, వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, అధికారాలకు కత్తెర వేసి బాధ్యతలు పెంచడంతో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం, అసంతృప్తితో ఉండటం సహజం. కనుక వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయానికి అపూర్వమైన ప్రజాధారణ లభిస్తోందని వారికి సంకేతాలు పంపించేందుకు, తమ ప్రభుత్వం అవినీతిరహితమైన, ప్రజారంజకమైన, పారదర్శకమైన పాలన అందించేందుకు ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటోందని ప్రజలకు చాటిచెప్పుకొనేందుకు ఈ పాలాభిషేకాల హడావుడి మొదలయిందేమో? కానీ ఈ హడావుడి చూస్తుంటే ఇది వెన్నెలమాసమని తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్లుంది.           



Related Post