అశ్వథామ రెడ్డి కధ ముగిసినట్లేనా?

September 12, 2020


img

గత డిసెంబర్‌, జనవరి నెలల్లో 55 రోజులపాటు నిరవధికంగా సాగిన ఆర్టీసీ సమ్మె రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. సుమారు 49,000 మంది ఆర్టీసీ కార్మికులందరినీ ఏకత్రాటిపై నడిపించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన వారిలో ఒకరైన టీఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వథామరెడ్డి సమ్మె ముగిసిన తరువాత కనుమరుగైపోయారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేయడం ద్వారా యూనియన్ నేతలకు పనిలేకుండా పోయింది. వారు కూడా తప్పనిసరిగా విధులకు హాజరుకాక తప్పని పరిస్థితి కల్పించింది. ఒకవేళ విధులలో చేరితే రాష్ట్ర ప్రభుత్వం తమపై వేధింపులకు పాల్పడుతుందని భావించిన కొందరు యూనియన్ నేతలు స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకోగా కొందరు యూనియన్ నేతలు విధులకు హాజరుకావడం లేదు. వారిలో అశ్వథామా రెడ్డి కూడా ఒకరు. 

ఎంజీబిఎస్ డిపోలో పనిచేస్తున్న ఆయన జనవరి 25 నుంచి ఆగస్ట్ 26వరకు విధులకు హాజరుకాకపోవడంతో, డిపో మేనేజర్ ఆయనకు పోస్టులో ఛార్జ్ షీట్ పంపించారు. కానీ అది వెనక్కు తిరిగిరావడంతో దానిని డిపోలో గోడకు అంటించి ఆ కాపీని వాట్సాప్‌ ద్వారా ఆయనకు పంపించారు. దానికీ ఆయన స్పందించకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆయనపై ఓ ఉన్నతాధికారితో విచారణ జరిపిస్తోంది. దానికి తప్పనిసరిగా హాజరుకావాలని అశ్వథామరెడ్డికి డిపో మేనేజర్ కబురు పంపించారు. ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే కార్మిక చట్టాల ప్రకారం ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని ఉద్యోగంలో నుంచి తొలగించడం ఖాయం. ఒకవేళ హాజరైనా ఆయన సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయినా ఉద్యోగంలో నుంచి తొలగించడం ఖాయం. 

ఒకవేళ ఆయన ఏదో విధంగా ఉద్యోగం కాపాడుకొన్నా యాజమాన్యం ఆయనకు ఏ బస్టాండ్ బయటో రోడ్డుపై నిలబడి బస్సులు, ఆటోలు, బర్రెలను నియంత్రించే డ్యూటీ అప్పగిస్తే చేయలేరు కనుక ఏవిధంగా చూసిన ఆర్టీసీలో అశ్వథామ రెడ్డి కధ ముగిసినట్లే.  49,000 మంది ఆర్టీసీ కార్మికులకు నాయకత్వం వహించి 55 రోజులు ఏకధాటిగా సమ్మె చేయించిన ఓ నాయకుడి ప్రస్థానం ఈవిధంగా అర్ధాంతరంగా ముగుస్తుందని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. బహుశః ఆయన కూడా ఊహించి ఉండరు.


Related Post