కాంగ్రెస్‌, బిజెపిలకు దుబ్బాక ఉపఎన్నికల అగ్నిపరీక్ష

September 11, 2020


img

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన దుబ్బాక శాసనసభ స్థానానికి అక్టోబర్-నవంబర్‌ మద్యలో ఉపఎన్నికలు జరుగనున్నాయి. కనుక కాంగ్రెస్, బిజెపిలు తమ శక్తిసామర్ధ్యాలను చాటుకొని జనాధారణను పరీక్షించుకోవడానికి దీనిని ఓ మంచి అవకాశంగా భావించడం సహజం. ఈ ఉపఎన్నికలపై బిజెపిలో ఇంకా హడావుడి కనిపించలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంచెం జోరుగానే కనిపిస్తోంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఇందిరాభవన్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ ఉపఎన్నికలు చాలా చారిత్రాత్మకమైనవి కనుక పార్టీలో అందరూ కలిసికట్టుగా పోరాడి మన అభ్యర్ధిని గెలిపించుకోవాలి. రెండు మూడు రోజులలోనే మన పార్టీ అభ్యర్ధి పేరును ప్రకటిస్తాను. ఇప్పటికే అభ్యర్ధి ఎంపికపై కొంత కసరత్తు పూర్తిచేశాము. అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తినే అభ్యర్ధిగా ఖరారు చేస్తాము,” అని చెప్పారు.

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలను ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై ప్రజాభిప్రాయంగా భావించవచ్చు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధి విజయం సాధిస్తే, అది టిఆర్ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా పడిన ఓటుగానే భావించవలసి వస్తుంది. రాష్ట్రంలో ఎప్పటికైనా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెపుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజాధారణ పెరిగిందా లేదా? అని తెలుసుకొనేందుకు ఈ ఉపఎన్నికలు పనికివస్తాయి. 

ఇక బిజెపి విషయానికి వస్తే...లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా 4 సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం మేమేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్న బిజెపికి, రాష్ట్రంలో పార్టీ  పగ్గాలు చేపట్టిన బండి సంజయ్‌కు ఈ ఉపఎన్నికలు ఓ సవాలు వంటివేనని చెప్పవచ్చు. ఈ ఉపఎన్నికలలో బిజెపి గెలిస్తేనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల గురించి ఏవైనా కలలు కనవచ్చు లేకుంటే సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు అదనంగా మరో రెండు మూడు సీట్లతో సర్దుకుపోక తప్పదు.     

కానీ ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ లక్షకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించబోతోందని సర్వేలలో తేలిందని సిఎం కేసీఆర్‌ ముందే జోస్యం చెప్పేశారు. ఒకవేళ టిఆర్ఎస్‌ సానుభూతి ఓటుతో గెలిచినప్పటికీ అది తమ పాలనకు గీటురాయివంటిదేనని చెప్పుకొంటుంది. 


Related Post