ఇక్కడ టిఆర్ఎస్‌ చేస్తున్నట్లే అక్కడ కేంద్రం...

September 11, 2020


img

సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ సమావేశాలలో ఈసారి కేంద్రంపై కత్తులు దూసేందుకు టిఆర్ఎస్‌ సిద్దం అవుతోంది. కేంద్రప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని, రాష్ట్రానికి రావలసిన నిధులు విడుదల చేయడం లేదని, జాతీయ రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు జరిపించడం లేదని ఇంకా చాలా విషయాలలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు అన్నారు. 

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నిన్న శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వంపై ఇంచుమించు ఇటువంటి ఆరోపణలే చేశారు. దాంతో మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరువురి మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.

తన నియోజకవర్గంలో చౌటుప్పల్, చండూరులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, వాటికి నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేయడమే తప్ప నిధులు విడుదల చేయడం లేదని ఆ కారణంగా అభివృద్ధి పనులు జరుగక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. 

రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చేబదులు ‘అభివృద్ధి పనులు చేస్తున్నాము గాబట్టే ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారని’ మంత్రి కేటీఆర్‌ అసంబద్దమైన సమాధానం చెప్పడం విశేషం. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ‘జీరో అవర్‌లో హీరోలా మాట్లాడొద్దని’ రాజగోపాల్ రెడ్డిని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొన్న కరోనా సంబంధిత అంశాలపై చర్చ జరిగినప్పుడు కూడా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై టిఆర్ఎస్‌ ప్రతికూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. 

ఇక్కడ శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, వారు ప్రభుత్వం దృష్టికి తెస్తున్న సమస్యలపై ప్రతికూలంగా స్పందిస్తున్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం, రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష సభ్యులు ప్రజాసమస్యలపై మాట్లాడితే వాటిని సానుకూలంగా స్వీకరించి పరిష్కరించే బదులు, ప్రభుత్వంపై బురదజల్లుడుగా టిఆర్ఎస్‌ భావిస్తున్నట్లే రేపు టిఆర్ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై నిరసనలు తెలిపితే కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా భావించవచ్చు కదా?ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షాలపట్ల టిఆర్ఎస్‌ వైఖరి ఏవిధంగా ఉందో అక్కడ పార్లమెంటులో టిఆర్ఎస్‌ ఎంపీల పట్ల కేంద్రం వైఖరి కూడా అదేవిధంగా ఉంటే ఆశ్చర్యం లేదు. 


Related Post