మజ్లీస్‌-టిఆర్ఎస్‌ కటీఫ్ చెప్పుకోబోతున్నాయా?

September 10, 2020


img

మొన్న శాసనసభలో స్వర్గీయ పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ తీర్మానాన్ని టిఆర్ఎస్‌ మిత్రపక్షం మజ్లీస్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. మర్నాడు అంటే నిన్న శాసనసభలో కరోనాపై చర్చ సందర్భంగా సిఎం కేసీఆర్‌, మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీల మద్య కాస్త తీవ్రంగానే వాదోపవాదాలు జరిగాయి.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో చాలా సీనియర్ అయ్యుండవచ్చు కానీ అంతమాత్రన్న నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదని తెలుసుకోవాలి. కరోనాపై ప్రభుత్వం శాసనసభకు నోట్ మాత్రమే సమర్పించింది. కనుక ప్రభుత్వం చెప్పదలచుకొన్న విషయమేదైనా సరే దానిలో క్లుప్తంగానే చెప్పాల్సి ఉంటుంది. ఈవిషయం తెలిసి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ నోటికి వచ్చినట్లు మాట్లాడి సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా సిఎం కేసీఆర్‌ పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. కానీ సిఎం కేసీఆర్‌ చాలా హుందాగా ఆయనకు బదులిచ్చారు. అక్బరుద్దీన్ ఓవైసీ సభలో ఓవర్ స్మార్ట్ గా మాట్లాడితే సహించవలసిన అవసరం మాకు లేదు. తప్పుగా మాట్లాడితే ధీటుగానే సమాధానం చెపుతాము. నేనిప్పుడు రాజకీయాల గురించి మాట్లాడదలచుకోలేదు. కానీ రాజకీయాలలో ఏదీ శాస్వితం కాదు నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయని మాత్రం చెప్పదలచుకొన్నాను. భట్టి విక్రమార్క సభలో పెద్ద మేధావిలా మాట్లాడాలనే ప్రయత్నంలో ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకొని మళ్ళీ మమ్మల్ని నిందించడం దేనికి? ప్రజాసమస్యలపై చర్చించడానికే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించడానికి శాసనసభ సమావేశాలు నిర్వహించడం లేదని తెలుసుకొంటే మంచిది. ప్రభుత్వాన్ని విమర్శించాలనుకొంటే పార్టీ కార్యాలయంలో కూర్చొని విమర్శించుకోవచ్చు. ఇక్కడ దాని కోసం సభా సమయం వృధా చేస్తామంటే కుదరదు,” అని అన్నారు. 

శాసనసభలో మారిన మజ్లీస్ వ్యవహార శైలి, దానికి మంత్రి తలసాని ఇచ్చిన ఘాటు జవాబు చూస్తే టిఆర్ఎస్‌-మజ్లీస్ పార్టీల మద్య దూరం పెరిగిందని అర్ధమవుతోంది. ‘రాజకీయాలలో మార్పు సహజం...ఏదైనా జరుగవచ్చు...’ అంటే మజ్లీస్ పార్టీతో కటీఫ్ చేసుకొనేందుకు టిఆర్ఎస్‌ సిద్దమవుతోందని భావించవచ్చు. మజ్లీస్ అవసరం ఇంకెంతమాత్రం లేదని టిఆర్ఎస్‌ భావిస్తుండటం వలననే మజ్లీస్ పార్టీతో కత్తులు దూసేందుకు సిద్దమైందా? జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మజ్లీస్ పార్టీతో టిఆర్ఎస్‌ తెగతెంపులు చేసుకొనే సాహసం చేయగలదా? సచివాలయంలో రెండు మసీదులు కూల్చినందుకు, స్వర్గీయ పీవీని భుజానికెత్తుకొన్నందుకు మజ్లీస్‌ పార్టీయే టిఆర్ఎస్‌కు దూరం జరగాలని నిశ్చయించుకొందా? అనే ప్రశ్నలకు త్వరలోనే ఆ రెండు పార్టీలే తప్పక సమాధానాలు చెపుతాయి.


Related Post