ఉస్మానియా ఆసుపత్రి దుస్థితిని అద్దంపట్టిన జూడాలు

September 10, 2020


img

సిఎం కేసీఆర్‌ నిన్న శాసనసభలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఆసుపత్రులలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని బల్లగుద్ది వాదించారు. కానీ 24 గంటలు గడువక మునుపే ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, మందులు, బ్యాండేజీలు కూడా లేవంటూ ధర్నా చేశారు. గత నెల 18వ తేదీన వారు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ బి.నాగేందర్ కు ఓ వినతి పత్రమిచ్చారు. దానిలో ఆపరేషన్లు చేసిన తరువాత రోగులకు కట్టు కట్టేందుకు బ్యాండేజీలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, గాయాలను కడిగేందుకు ఉపయోగించే బేటాడిన్ లేదా స్పిరిట్ వంటివి కూడా లేవని, ఆపరేషన్ థియేటర్స్ లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదని, వెంటిలేటర్లు, మానిటర్లు పనిచేయడం లేదని వారు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణం బ్యాండేజీలు, మందులు, కనీస సౌకర్యాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సరిపడినన్ని మందులు, బ్యాండేజీలు అన్నీ ఉన్నాయని కొందరు జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఉద్దేశ్యపూర్వకంగా ఈవిధంగా పిర్యాదులు, ధర్నాలు చేస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌ ఆరోపించారు. 

ఉస్మానియా ఆసుపత్రి సమస్యలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు తెలియవనుకోలేము. కానీ దాదాపు నెలరోజులు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇవాళ్ళ  జూనియర్ డాక్టర్లు మళ్ళీ ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేశారు. ‘ప్రజారోగ్యం’ పేరుతో ఓ దిష్టిబొమ్మను పెట్టి దానికి మందులు, బ్యాండేజీలు, ఆపరేషన్ థియేటర్ లేకుండా వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ విన్నూత్నంగా నిరసనలు తెలిపారు. 

ఒకవేళ రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులలో సౌకర్యాలు ఉన్నమాట నిజమైతే నిన్న శాసనసభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది లేరంటూ ప్రభుత్వానికి ఎందుకు నివేదిక ఇస్తారు?ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కరోనాపై కూడా రాజకీయాలు చేస్తోందనుకొన్నా నేడు ఉస్మానియాలో జూనియర్ డాక్టర్లు ఎందుకు ధర్నా చేస్తున్నారు? గత రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో ఏదో ఓ ఆసుపత్రిలో తరచూ వైద్యులు, నర్సులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇటువంటి సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ్ళ మళ్ళీ ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ధర్నా చేస్తున్నారు..అంటే ఏమనుకోవాలి?

http://www.mytelangana.com/telugu/Admin/updateNewsContent/22365/viewNewsContents 


Related Post