ఆ ధీమాతోనే కరోనా వ్యాప్తి?

September 10, 2020


img

భారతదేశంలో రోజుకు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 95,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 44,65,000కి చేరింది. రోజుకు నమోదయ్యే కేసులు పెరుగుతుండటం కరోనా సామాజిక వ్యాప్తి పతాకస్థాయికి చేరుకొందని సూచిస్తోంది. కనుక రానున్న రోజులలో మరింత వేగంగా కరోనా మహమ్మారి దేశమంతటా వ్యాపించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. 

దీనికి ప్రధాన కారణం ‘కరోనా సోకినా ప్రాణాలు పోవు....నాలుగైదు రోజులు మందులు వాడితే జలుబు జ్వరంలాగే ఇదీ తగ్గిపోతుందని’ ప్రజలలో ధీమా ఏర్పడటమే అని చెప్పవచ్చు. అది నిజమే కావచ్చు కానీ ఆ ధీమాతో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకుండా బహిరంగ ప్రదేశాలలో తిరుగుతుండటం వలన కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కరోనాబారిన పడి కొలుకొంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ కొందరు బాధ్యతారాహిత్యంగా తిరుగుతుండటం వలన దీర్గకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, వృద్ధులు కరోనా బారినపడి చనిపోతున్నారు. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ కరోనా పరీక్షలు, కరోనా చికిత్స, మందులు, ఆసుపత్రుల నిర్వహణ, కరోనా సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రజారోగ్య, మునిసిపల్, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పనిచేయడం వంటివన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవే. ప్రభుత్వం పడుతున్న ఈ భారం అంతా మళ్ళీ పన్నుల రూపంలో ప్రజలే మోయవలసి ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. కరోనా విషయంలో ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లయితే దానికి ఏదో రూపంలో తిరిగి వారే మూల్యం చెల్లించవలసి వస్తుందని గ్రహిస్తే మంచిది. కనుక దేశ ప్రజలందరూ కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తే, వారూ... వారి వలన ఇతరులూ కరోనా బారిన పడకుండా తప్పించుకోగలుగుతారు. దేశంపై ఆర్ధికభారం తగ్గించినవారవుతారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి ఈవిధంగా ఉంది: 

గత 24 గంటలలో నమోదైన పాజిటివ్ కేసులు

95,735

గురువారం నాటికి మొత్తం పాజిటివ్ కేసులు

44,65,864

మొత్తం యాక్టివ్ కేసులు

9,00,000

గత 24 గంటలలో చనిపోయినవారి సంఖ్య

1,172

నేటి వరకు దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య

75,062

మరణాల రేటు

1.6 శాతం

గురువారం వరకు కోలుకొన్నవారి సంఖ్య

34,71,784

కరోనా రికవరీ రేటు

78.77 శాతం



Related Post