రెవెన్యూ కధకు అనూహ్యమైన క్లైమాక్స్

September 09, 2020


img

ఇవాళ్ళ కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ సందర్భంగా సిఎం కేసీఆర్‌ రెవెన్యూశాఖలో అవినీతికి నిలయంగా మారిందని చెపుతుంటే బయట సరిగ్గా అదే జరుగుతుండటం విశేషం. ఓ భూవివాదం సెటిల్మెంట్ చేసేందుకు మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మూర్తి అనే ఓ వ్యాపారి నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకొంటుండగా పట్టుబడ్డాడు. వారిమద్య సాగిన ఆడియో సంభాషణల రికార్డింగ్ కూడా ఏసీబీ చేతికి చిక్కాయి. 

ఏసీబీ అధికారులు ఆయన ఇంటితో పాటు ఒకేసమయంలో ఆయన సమీప బందువులు, ఆర్డీవో బండారు అరుణారెడ్డి, ఎమ్మార్వో సత్తార్, వీఆర్వో, వీఆర్ఏ, జూనియర్ అస్సిస్టెంట్ ఇళ్ళు, కార్యాలయాలపై కూడా దాడులు చేసి లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, భారీగా నగదు, భూములకు సంబందించిన డాక్యుమెంట్లు, బ్లాంక్ చెక్కులు వగైరాలను స్వాధీనం చేసుకొంటున్నారు. 

మెదక్‌ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకుగాను ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున మొత్తం ఒక కోటి 12లక్షలు లంచం ఇవ్వాలని మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ డిమాండ్ చేశాడు. దానిలో రూ.40 లక్షలు నగదు రూపంలో, మిగిలిన సొమ్మును భూమి రూపంలో తాను చెప్పిన వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని షరతు విధించాడు. అందుకు అంగీకరించిన సదరు వ్యాపారి మూర్తి గత రెండు వారాలుగా నగేష్ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ముందు అనుకొన్నట్లుగా రూ.40 లక్షల నగదు ఇస్తేగాని ‘పని జరగదని’ గడ్డం నగేష్ చెప్పడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పధకం ప్రకారం గడ్డం నగేష్ మూర్తి నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకొంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. 

తీగలాగితే డొంకంతా కదిలినట్లు నగేష్ గడ్డం పట్టుకొంటే వరుసగా మిగిలినవారందరి పిలకలు దొరికాయి. ఏసీబీ అధికారులు ఇవాళ్ళ ఉదయం నుంచి ఒకేసారి 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూశాఖలో అవినీతిని ప్రక్షాళనం చేయడానికి శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినరోజే ఇన్ని అవినీతి తిమింగలాలు పట్టుబడటం ఈ కధకు క్లైమాక్స్ అనే చెప్పుకోవాలేమో?


Related Post