రూల్స్‌తో ప్రతిపక్షాల నోళ్ళు మూయించిన టిఆర్ఎస్‌

September 09, 2020


img

ఈసారి శాసనసభ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కరోనా సంబందిత సమస్యలపై గట్టిగా నిలదీయాలనుకొన్న కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్‌ ప్రభుత్వం రూల్స్‌ పేరుతో నోరు మూయించడం విశేషం. సభలో సభ్యుల సంఖ్య ప్రకారం టిఆర్ఎస్‌కు 74 నిమిషాలు, కాంగ్రెస్ పార్టీకి 5 నిమిషాలు కేటాయించవలసి ఉండగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దయతలచి కాంగ్రెస్ పార్టీకి అదనంగా మరో 5 నిమిషాలు కేటాయించారని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ అన్నారు. కానీ కాంగ్రెస్‌ నేతలు స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజాసమస్యలపై ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్దమని గొప్పలు చెప్పుకొన్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం, రూల్స్ పేరుతో సభలో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనీయకుండా గొంతు నొక్కుతోందని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ్ళ శాసనసభలో ఇదే విషయంపై ఆయన స్పీకరుతో వాగ్వాదానికి దిగారు కూడా. కానీ రూల్స్ ప్రకారం సభలో సభ్యుల సంఖ్య ఆధారంగానే సమయం కేటాయిస్తామని స్పీకర్ పోచారం స్పష్టం చేశారు. 

కరోనాను కట్టడి చేయడంలో, కరోనా రోగులకు పరీక్షలు చేయడంలో, చికిత్స అందించడంలో, ఆసుపత్రులలో వైద్యసదుపాయాలు కల్పించడంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వాదిస్తున్న కాంగ్రెస్ పార్టీ, శాసనసభ సమావేశాలలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలనుకొంటే రూల్స్ పేరుతో ఇంత సులువుగా కాంగ్రెస్‌ నోరు కట్టేయడం నిజంగా చాలా గొప్ప వ్యూహమేనని అంగీకరించక తప్పదు. కానీ శాసనసభలో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెపుదామన్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడు ఈవిధంగా తప్పించుకోవాలని ప్రయత్నించడం గమనిస్తే, కరోనాను ఎదుర్కొనే విషయంలో తన వైఫల్యాలను అంగీకరించినట్లే అనుకోవాలేమో? 

ఈసారి రూల్స్ పేరుతో టిఆర్ఎస్‌ తమ నోళ్ళు మూయించగలదని రాజకీయాలలో తలపండిపోయిన కాంగ్రెస్‌ నేతలు ముందుగా గ్రహించలేకపోవడం కూడా చాలా విడ్డూరమే.


Related Post