టైటానిక్‌లో కూర్చొని మోడీకి హెచ్చరికలా?

September 09, 2020


img

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భారతదేశం ప్రస్తుత పరిస్థితిని మునిగిపోబోతున్న టైటానిక్ షిప్పుతో పోల్చారు. ఈనెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ పాలనలో భారతదేశం పరిస్థితి మునిగిపోబోతున్న టైటానిక్ షిప్పులా మారిందని విమర్శించారు. ఓ పక్క అదుపుతప్పిన కరోనా, మరోపక్క లాక్‌డౌన్‌ కారణంగా కుంటుపడిన దేశ ఆర్ధికవ్యవస్థ, ఇవి చాలావన్నట్లు సరిహద్దులో చైనాతో యుద్ధవాతావరణంతో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ అంతా చాలా అద్భుతంగా సాగిపోతోందంటూ దేశప్రజలను మభ్యపుచ్చుతున్నారని ఆరోపించారు. టైటానిక్ షిప్పు మంచు పర్వతాలను గుద్దుకొని మునిగిపోయినట్లు త్వరలోనే ఇవన్నీ ఒకేసారి బయటపడతాయని రాహుల్‌ గాంధీ జోస్యం చెప్పారు. భారత్‌ భూభాగంలోకి చైనా సేనలు చొచ్చుకరాలేదని వాదిస్తున్న కేంద్రప్రభుత్వం మరి సరిహద్దులలో అంత భారీగా సైన్యాన్ని ఎందుకు మోహరించిందని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. నరేంద్రమోడీ పాలన మొదటి నుంచి కూడా చాలా అస్తవ్యస్తంగా సాగుతోందని అది రాన్రాను మరింత దిగజారుతోందన్నారు. మోడీ అస్తవ్యస్తపాలనపై కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని రాహుల్‌ గాంధీ సూచించారు. 

కరోనా, ఆర్ధిక పరిస్థితి, సరిహద్దులలో చైనాతో యుద్ధవాతావరణం గురించి రాహుల్‌ గాంధీ చెప్పినవన్నీ నిజాలే. కానీ ప్రపంచదేశాలన్నీ నేటికీ కరోనాతో పోరాడుతూనే ఉన్నాయి. ఏ ఒక్కటీ ఈ సమస్య నుంచి బయటపడలేకపోయింది. కరోనాపై పోరాటంలో భాగంగా లాక్‌డౌన్‌ విధించవలసి రావడంతో అభివృద్ధి చెందిన అమెరికాతో సహా ప్రపంచంలో అన్ని దేశాల ఆర్ధికవ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని దేశాలు అనారోగ్యం, ఆహారభద్రత, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 

ఈ సమస్యలన్నిటినీ మాయం చేసేందుకు కేంద్రప్రభుత్వం వద్ద మంత్రదండం ఏమీ లేదు కనుక అది కూడా ఈ సమస్యల నుంచి దేశాన్ని బయటపడేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక చైనా రాజ్యవిస్తరణ కాంక్ష మన దేశానికి శాపమని భావించక తప్పదు. కనుక చైనాను నిలువరించడానికి సరిహద్దుల వద్ద భారీగా సైనికులను మోహరించడం అనివార్యమే. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇదేవిధంగా చేసి ఉండేది కదా? 

కానీ ఈ సమస్యలేవీలేనప్పుడు పదేళ్ళ యూపీఏ పాలనలోనే దేశఆర్ధిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైన సంగతి దేశప్రజలందరికీ గుర్తుంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం అవినీతి, అసమర్థత, కుంభకోణాలకు చిరునామాగా మారిపోయినందునే దేశప్రజలు కాంగ్రెస్ పార్టీని గద్దె దించి బిజెపికి పట్టం కట్టిన సంగతి రాహుల్‌ గాంధీ మరిచిపోయారు. ఆ పరాజయంతోనే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామాతో అస్త్రసన్యాసం చేశారు. పార్టీలో 21 మంది సీనియర్లు ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తుండటంతో నేటికీ ఆయన మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టలేకపోతున్నారు. దాంతో నాయకత్వ సమస్యతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మునిగిపోతున్న టైటానిక్ షిప్పులా తయారైంది. మునిగిపోతున్న కాంగ్రెస్‌ ఓడలో కూర్చొనున్న రాహుల్‌ గాంధీ తనను తాను, ఆ ఓడలో ఉన్నవారిని ఏవిధంగా కాపాడుకోవాలని ఆలోచించే బదులు మోడీ సారధ్యంలో భారతదేశం మునిగిపోతోందని గగ్గోలు పెడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. 


Related Post