కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయం తప్పదు: కేసీఆర్‌

September 08, 2020


img

సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టిఆర్ఎస్‌ ఎల్పీ సమావేశంలో సిఎం కేసీఆర్‌ ‘కేంద్ర రాజకీయాలలో శూన్యత నెలకొందని, కాంగ్రెస్‌ బిజెపిలకు ప్రత్యామ్నాయం అవసరమని చేసిన వ్యాఖ్యలతో ఆయన ‘నయా భారత్‌’ అనే జాతీయపార్టీని స్థాపించబోతున్నట్లు మీడియాలో వచ్చిన ఊహాగానాలు నిజమని దృవీకరించినట్లయింది. 

“కేంద్రప్రభుత్వం దేశంలో సమస్యలను పరిష్కరించకుండా పాకిస్థాన్‌ను బూచిగా చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. మోడీ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఎప్పుడూ ఏ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం చేజిక్కించుకోవాలనే ఆలోచనే తప్ప కరోనా నివారణ, దేశ ఆర్ధిక పరిస్థితి గురించి ఆలోచించడం లేదు. జిఎస్టీలో తెలంగాణకు వాటాను కూడా చెల్లించడంలేదు. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతూనే ఉంది. తమ ప్రభుత్వాలను కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ఉంది. కాంగ్రెస్‌, బిజెపిల వలన దేశానికి ఇంకా నష్టమే తప్ప ఒరిగేదేమి ఉండదు. కనుక వాటికి ప్రత్యామ్నాయంగా ఓ బలమైన రాజకీయ వేదిక అవసరం. ప్రస్తుతం కేంద్రస్థాయిలో రాజకీయ శూన్యత నెలకొని ఉంది,” అని సిఎం కేసీఆర్‌ మాటల సారాంశం. 

సిఎం కేసీఆర్‌ తాను జాతీయ రాజకీయాలలో ప్రవేశించి కేంద్రంలో చక్రం తిప్పాలని కోరుకొంటున్నానని స్వయంగా పలుమార్లు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్‌ పేరుతో ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. కానీ బిజెపి మళ్ళీ భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా అటకెక్కించక తప్పలేదు. కానీ ఆ ప్రతిపాదనను విరమించుకోలేదని, సరైన సమయం రాగానే రంగంలో దిగడానికి సిద్దంగా ఉన్నానని సిఎం కేసీఆర్‌ నిన్న చెప్పకనే చెప్పారనుకోవచ్చు. ఆ సరైన సమయం ఇప్పుడు వచ్చిందా లేక ఇంకా ఎప్పుడనేది సిఎం కేసీఆరే చెప్పాలి. అయితే యుద్ధరంగంలోకి వెళ్ళేముందు సన్నాహాలు కూడా చేసుకోవలసి ఉంటుంది కనుక ‘నయా భారత్‌’ పార్టీ స్థాపనపై రాష్ట్రంలో చర్చ మొదలయ్యే చేయడం ద్వారా మళ్ళీ సన్నాహాలు మొదలుపెట్టారేమో?త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Related Post